ACB Court: కసిరెడ్డి బెయిల్‌పై తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Jun 21 , 2025 | 05:20 AM
వైసీపీ హాయంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
తీర్పు రిజర్వ్ చేసిన బెజవాడ ఏసీబీ కోర్టు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్‌పై 24న విచారణ
అజ్ఞాతంలోనే మోహిత్ రక్షణ కోరుతూ పిటిషన్
విజయవాడ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ హాయంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తూ న్యాయాధికారి పి. భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డితోపాటు మరో నిందితుడు పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను 24వ తేదీకి వాయిదా వేశారు. మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ పి. కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలను 23కి వాయిదా వేశారు.
‘చెవిరెడ్డి’ బెయిల్‌పై విచారణ వాయిదా
విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు చెరుకూరి వెంకటేశ్‌నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లపై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. వీరిద్దరూ తమకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈ నెల 24న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. వాటిపైనా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అరెస్టు నుంచి కాపాడండి: మోహిత్ రెడ్డి
మద్య కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసులో మోహిత్‌రెడ్డి 39వ నిందితుడి(ఏ39)గా ఉన్నారు. ఆయనను నిందితుడిగా చేర్చుతూ సిట్ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత మోహిత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. తనను సిట్ అధికారులు అరెస్టు చేస్తారని నిర్ధారణకు వచ్చిన ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.