ACB Court: లిక్కర్ చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:24 AM
మద్యం కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ రెండు చార్జిషీట్లపై మొత్తం 21 అభ్యంతరాలకు మూడు రోజుల్లో సమాధానం...
దర్యాప్తు అధికారికి మెమో జారీ
విజయవాడ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో సిట్ దాఖలు చేసిన రెండు చార్జిషీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ రెండు చార్జిషీట్లపై మొత్తం 21 అభ్యంతరాలకు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం మెమో జారీ చేశారు. నిందితులందరికీ ఈ కేసుకు సంబంధించిన కాపీలు అందించారా అని కోర్టు ప్రశ్నించింది. అవినీతి నిరోధక చట్టం ఈ కేసుకు ఎలా వర్తిస్తుందో తెలియజేయాలని అడిగింది. ఇప్పటివరకు ఎంతమంది సాక్షులను సిట్ విచారించిందో తెలియజేయాలని, ఎంతమంది సాక్షుల నుంచి సీఆర్పీసీ 161 వాంగ్మూలం నమోదు చేశారు అని ప్రశ్నించింది. రెండు చార్జిషీట్లలో ప్రిలిమినరీ/ఫైనల్ చార్జిషీట్ అని చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. ఫోరెన్సిక్ నివేదికలు కోర్టుకు సమర్పించకుండా చార్జిషీటు ఎలా అర్హత పొందుతుందని అడిగింది. కేసులో 7 నుంచి 15 మంది వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని మెమోలో ప్రశ్నించింది. చార్జిషీట్‌లో ప్రేయర్ పోర్షన్ సరిగ్గా సమర్పించాలని సిట్‌ను న్యాయాధికారి భాస్కరరావు ఆదేశించారు. కాగా, మద్యం కుంభకోణంలో దాఖ లు చేసిన రెండు చార్జిషీట్ల కాపీలను పెన్‌డ్రైవ్‌లో నిందితులకు అందజేయాలని సిట్ నిర్ణయించింది. మొత్తం 11 పెన్‌డ్రైవ్‌ల్లోకి చార్జిషీట్లను కాపీ చేసి వాటిని న్యాయాధికారి పి.భాస్కరరావుకు చూపించారు. ఇక, మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిమాండ్ పొడిగింపునకు సంబంధించి సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఇక చెవిరెడ్డి దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ల విచారణను వాయిదా వేసింది.