Share News

CID Advocate Petition: ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో.. మద్యం దర్యాప్తునకు దెబ్బ

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:50 AM

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే విషయంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి చట్టంలో లేని విధానాలు అనుసరిస్తున్నారని సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది...

CID Advocate Petition: ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో.. మద్యం దర్యాప్తునకు దెబ్బ

  • మిథున్‌రెడ్డి నిర్దోషి అనేలా న్యాయాధికారి బెయిల్‌ ఆదేశాలు

  • హైకోర్టుకు సీఐడీ నివేదన.. మిథున్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే విషయంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి చట్టంలో లేని విధానాలు అనుసరిస్తున్నారని సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. కేసు దర్యాప్తు దశలో ఉండగానే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (ఏ-4) నిర్దోషి, నిజాయితీపరుడు అనేలా బెయిల్‌ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు పలు అంశాలను ప్రస్తావించిందన్నారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో మిథున్‌రెడ్డి కీలక సూత్రధారి అని చెప్పేందుకు చూపిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ తీర్పులోని అంశాల ఆధారంగా ఇతర నిందితులు కూడా బెయిల్‌ మంజూరు చేయాలని కోరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలుపుదల చేయాలని కోరారు. మిథున్‌రెడ్డి ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారని, నోటీసులు జారీ చేసి ఆయన వాదన కూడా వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు గుర్తుచేసింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి(ఏ-32), బాలాజీ గోవిందప్ప(ఏ-33)లకు డీఫాల్ట్‌ బెయిల్‌, మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు విషయంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారి తీసుకున్న నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో.. లోతుగా విచారణ జరిపి నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.


మొదట అలా.. తర్వాత వేరేలా..

మద్యం కేసులో మిథున్‌రెడ్డికి బెయిలిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గత నెల 29న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా దర్యాప్తు సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ‘మిథున్‌రెడ్డి మొదట వేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఆగస్టు 18న కొట్టివేసింది. పదిరోజులు కూడా గడవక ముందే ఆయన రెండో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మొదట వేసిన బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన అనంతరం పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. పరిస్థితుల్లో మార్పు లేకుండా బెయిలివ్వకూడదనేది న్యాయసూత్రం. దీనిని పాటించకుండా ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్రకు సంబంధించిన ఆధారాలను మొదటి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ముందుంచాం. సీఆర్‌పీసీ సెక్షన్లు 161, 164 కింద రికార్డు చేసిన వాంగ్మూలాలను, గూగుల్‌ టేకౌట్‌, ఇతర సాంకేతిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మొదటి బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. 10 రోజులు కూడా గడవకముందే వేసిన రెండో బెయిల్‌ పిటిషన్‌లో సెక్షన్‌ 161 కింద రికార్డు చేసిన వాంగ్మూలాలను.. మిథున్‌రెడ్డి పాత్రను నిర్ధారించే ఆధారాలుగా పరిగణించలేమని కోర్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. మిథున్‌రెడ్డి కింగ్‌పిన్‌ అంటూ సెక్షన్‌ 164 కింద రికార్డు చేసిన వాంగ్మూలాలను పరిశీలించలేదు’ అని తెలిపారు.

Updated Date - Oct 07 , 2025 | 05:51 AM