ACB Court: లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది ఆస్తుల జప్తు సిట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:33 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో 11 మంది నిందితుల ఆస్తులను జప్తు చేసుకోవడానికి సిట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
సిట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి
దర్యాప్తు బృందం అడిగిన వివరాలు ఇవ్వాలని చెన్నై రిజిస్ట్రేషన్స్ ఐజీకి ఆదేశం
విజయవాడ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో 11 మంది నిందితుల ఆస్తులను జప్తు చేసుకోవడానికి సిట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మద్యం కేసు దర్యాప్తునకు సంబంధించి సిట్ అడిగిన వివరాలను ఇవ్వాలని చెన్నై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీని ఆదేశించింది. శుక్రవారం న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. మద్యం కేసులో నిందితులు చెన్నై కేంద్రంగా వ్యవహారాలను చక్కబెట్టారు. అక్కడ కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంక్ ఖాతాలు తెరిచారు. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ వివరాల కోసం సిట్ అధికారులు చెన్నైలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీకి పలుమార్లు లేఖలు రాశారు. అనేక మెయిల్స్ పంపారు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 111, 126 ప్రకారం నిందితులకు సహకరించిన 11 మంది ఆస్తులను జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.