Liquor Scam: లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:41 AM
మద్యం కుంభకోణం కేసులో ఏడుగురు నిందితులకు రిమాండును ఈనెల 12వ తేదీ వరకు కోర్టు పొడిగించింది..
ఏడుగురికి 12 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు
విజయవాడ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ఏడుగురు నిందితులకు రిమాండును ఈనెల 12వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడలోని జిల్లాజైలులో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, గుంటూరు జైల్లో ఉన్న బాలాజీ యాదవ్, నవీన్‌కృష్ణలను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ ఏడుగురికి రిమాండ్‌ను పొడిగించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఆయన కోర్టుకు హాజరుకాలేదు. ఆయన ఈనెల 11వ తేదీ సాయంత్రం జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. అలాగే, బెయిల్‌పై విడుదలైన కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్టే ఇచ్చిన హైకోర్టు ఈనెల 11వ తేదీన తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. కోర్టు హాల్లో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ అధికారులు సీజ్ చేసిన రూ.11 కోట్లను ప్రస్తావించారు. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అయితే, దీనిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని చదువుకోవాలని కసిరెడ్డికి న్యాయాధికారి సూచించారు.