Share News

ACB Court: మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:23 AM

జగన్‌ హయాంలో మోపిన మరో కేసులో సీఎం చంద్రబాబుకు విముక్తి లభించింది. 2014-19 వరకు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన మద్యం విధానంలో అవినీతి...

ACB Court: మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి

  • జగన్‌ హయాంలో పెట్టిన కేసు కొట్టివేత

  • నాడు ఫిర్యాదు చేసిన ఎండీ వాసుదేవరెడ్డే

  • ఉపసంహరించుకుంటున్నట్లు నివేదన

  • అభ్యంతరం లేదంటూ అఫిడవిట్‌ వేసిన ప్రస్తుత ఎండీ శ్రీధర్‌

  • దీంతో కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు

విజయవాడ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో మోపిన మరో కేసులో సీఎం చంద్రబాబుకు విముక్తి లభించింది. 2014-19 వరకు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 2023లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత.. అప్పటి సర్కారు ఆయనపై వరుసగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ అప్పటి రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో చంద్రబాబుపై కేసు మోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వాసుదేవరెడ్డి 15 రోజుల కిందట కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న సీహెచ్‌ శ్రీధర్‌ కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్‌ వేశారు. దీంతో కేసును కొట్టివేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.


ఇదీ కేసు..

2014-19 మధ్య అమలు చేసిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 2023 అక్టోబరు 30న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనివాస శ్రీనరేశ్‌, ఏ-2గా అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ-3గా చంద్రబాబు పేర్లను చేర్చారు. చంద్రబాబుపై అప్పట్లో పెట్టిన ఫైబర్‌నెట్‌ స్కాం కేసును కూడా ఇటీవల ఏసీబీ కోర్టు మూసివేసింది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ క్లీన్‌చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఫైబర్‌నెట్‌ పూర్వ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.మధుసూదనరెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Dec 02 , 2025 | 04:23 AM