School Education Department: పాఠశాలల్లోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:40 AM
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల’ విధానాన్ని తీసుకొచ్చింది.
సుదీర్ఘకాలం తర్వాత తాత్కాలిక టీచర్ల విధానం
1,146 మంది నియామకానికి అనుమతి
ఈ నెల 8 నుంచి ఐదు నెలల పాటు విధుల్లో..
ఎస్‌ఏలకు 12,500, ఎస్జీటీలకు 10 వేల పారితోషికం
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ‘అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల’ విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులకు బోధనలో అంతరం ఏర్పడకుండా ఈ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లు పనిచేసేవారు. తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకొని పారితోషికం చెల్లించేవారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పేరుతో ఆ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఇటీవల మెగా డీఎస్సీతో భారీఎత్తున టీచర్లను భర్తీ చేసినప్పటికీ.. ఇంకా ఖాళీలున్న చోట్ల ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. వీరి నియామకానికి అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వు లు జారీచేసింది. 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 892, ఎస్జీటీ 254 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.12,500, ఎస్జీటీకి రూ.10 వేలు పారితోషికంగా చెల్లిస్తారు. ఐదు నెలల కాలం వీరు విధుల్లో ఉంటారు. ఇందుకోసం రూ.8.21 కోట్లను సమగ్రశిక్ష నిధులు కేటాయించారు. ఈనెల 8 నుంచి విధుల్లోకి వచ్చే ఇన్‌స్ట్రక్టర్లు మే 7వ తేదీ వరకు కొనసాగుతారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా తొలగింపబడతారని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ 300, తెలుగు స్కూల్ అసిస్టెంట్ 130 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్లను తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
నియామక ప్రక్రియ ఇలా..
మండల స్థాయిలో ఎంఈవో ఖాళీలపై ప్రకటన జారీచేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. బుధవారం నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆ తర్వాత ఆ జాబితాలను ఎంఈవోలు డీఈవో కార్యాలయాలకు పంపుతారు. వారి అకడమిక్, ప్రొఫెషనల్ అర్హత ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. అకడమిక్‌కు 75 శాతం, ప్రొఫెషనల్ అర్హతకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. స్థానిక గ్రామాలు, మండలాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియను ఈనెల 7లోగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధులకు హాజరు కావాలి. ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలని ఇన్‌స్ట్రక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఆ ఖాతాలకే పారితోషికం జమ చేస్తారు.