CM Chandrababu: అపార వనరులున్నాయ్..పెట్టుబడులతో ఏపీకి రండి
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:23 AM
రాష్ట్రంలో అపార వనరులున్నాయని, వ్యాపార అభివృద్ధికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.
సింగపూర్ పర్యటన చివరి రోజు దిగ్గజ సంస్థలు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. 4 రోజుల్లో 26 భేటీలు
పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు
అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అపార వనరులున్నాయని, వ్యాపార అభివృద్ధికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సింగపూర్ పర్యటనలో చివరిరోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్తక, వాణిజ్య, పరిశ్రమల ఏర్పాటు అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరుల గురించి వివరించారు. ప్రాంతాల వారీగా పారిశ్రామిక, వాణిజ్య ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి అనువైన వనరుల గురించి విరించారు. కీలక కంపెనీలైన క్యాపిటాల్యాండ్ ఇన్వె్‌స్టమెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం వేర్వేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు , డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్‌షి్‌ప్స వంటి అంశాలపై క్యాపిటాల్యాండ్ ప్రతినిధులు సంజీవ్ దాస్‌గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వారికి సీఎం తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల ద్వారా అభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలనూ వారితో పంచుకున్నారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నై మధ్య ఎయిర్‌పోర్టు ఎకనామిక్ కారిడార్ గురించి కూడా చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో తాము 30- 35 శాతం పెట్టుబడులు పెట్టామని క్యాపిటాల్యాండ్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. రియల్ ఎస్టేట్,పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు.
మందాయ్ సీఈవోతో సీఎం చర్చలు
మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థ సీఈవో మైక్ బార్క్‌లేతో జరిగిన సమావేశంలో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై చంద్రబాబు చర్చించారు. విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగాల్లో భాగస్వామ్యంతో వెళ్తే చక్కటి అవకాశాలు ఉంటాయని సీఎం తెలిపారు. సింగపూర్ గార్డెన్ సిటీ , జూపార్కు మోడళ్లను ఏపీలోనూ స్థాపించే అవకాశాలపై చర్చించారు. విశాఖలో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సీఎం కోరగా.. ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
డ్రోన్, డిఫెన్స్ పరిశ్రమలకు చేయూత
మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సీఎం సమావేశమయ్యారు. లేపాక్షి, ఒర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, రక్షణ, సివిల్ ఏరోస్పేస్ కారిడార్ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇన్‌ఫ్రా, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తామని కన్నన్ చెప్పారు.
సీఎంకు ఘనంగా వీడ్కోలు
సింగపూర్ పర్యటన ముగించుకుని చంద్రబాబు బుధవారం రాష్ట్రానికి తిరుగుప్రయాణమయ్యారు. ఆయనకు సింగపూర్‌లోని తెలుగువారు ఘనంగా వీడ్కోలు పలికారు. ‘జై సీబీఎన్’ అని నినాదాలు చేశారు. ఇక్కడి ప్రజల ఆదారాభిమానాలు మరువలేనివని సీఎం అన్నారు.
ఎంఎస్ఎంఈలు.. ఏపీఐఐసీ జాయింట్ వెంచర్లు
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హోల్డింగ్స్‌కు చెందిన పోర్ట్‌ఫోలియో డెవల్‌పమెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేశ్ ఖన్నాతో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఎంఎ్‌సఎంఈల అభివృద్ధికి ఆ సంస్థ సహకారాన్ని కోరారు. ఈ రంగంలో భాగస్వామ్యానికి, ఏపీఐఐసీతో జాయింట్ వెంచర్లకు టెమాసెక్ ఆసక్తి చూపింది. సమావేశంలో మంత్రులు నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.