Amaravati Cultural Festival: ‘ఆవకాయ’..అమరావతి ఉత్సవం
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:23 AM
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు ‘ఆవకాయ...
పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలోజనవరి 8 నుంచి 10 వరకూ నిర్వహణ
ప్రవేశం పూర్తి ఉచితం
పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేశ్
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు ‘ఆవకాయ... అమరావతి ఉత్సవ్’ను నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఉత్సవ్ పోస్టర్‌ను సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్... సంయుక్తంగా మూడు రోజులపాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవాని ద్వీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఉత్సవానికి ప్రవేశం ఉచితం. అమరావతిని సాహితీ, కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టు. గత ప్రభుత్వం కళలను నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవనం కల్పించింది. తెలుగు వారి రుచులను ఆవకాయ్ ఉత్సవ్‌లో రుచి చూపిస్తాం’ అని మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ... ‘దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి.
జనవరి నెలలోనే గండి కోట, అరకు, విశాఖ, ఫ్లెమింగో ఉత్సవ్‌లను నిర్వహిస్తాం. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.40 నుంచి రూ.50 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆవకాయ ఉత్సవ్ నిర్వహణకు రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నాం’ అని తెలిపారు. అనంతరం ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ... ‘‘సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలతో కూడిన బహుముఖ కార్యక్రమాల ద్వారా ఏపీ సాంస్కృతిక, సుజనాత్మక బలాన్ని ప్రదర్శించడానికి ‘ఆవకాయ’ రూపకల్పన జరిగింది’’ అని చెప్పారు. ఈ ప్రాంతపు ఆలోచనలు, కథలు, ప్రదర్శనలను ఒక చోట చేర్చే బహిరంగ వేదికే ఈ ఉత్సవం అని టీమ్ వర్క్ ఆర్ట్స్ ఎండీ సంజయ్ కె రాయ్ తెలిపారు.