Tribal Development: గిరిజన ప్రాంతాల్లో ఆది కర్మయోగి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:45 AM
గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది.
తొలివిడతలో ఏపీలో నాలుగు జిల్లాల్లో అమలు
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. దీన్ని కేంద్ర పథకమైన ధార్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీయూఏ)తో అనుసంధానం చేస్తూ గిరిజనాభివృద్ధికి తోడ్పడాలని సంకల్పించింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు, ప్రభుత్వ అధికారులు, గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, పాలన పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామర్థ్య పెంపు శిక్షణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుండగా.. తొలివిడతలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు మాస్టర్ ట్రైనర్లను నియమిస్తుంది. ముందుగా మాస్టర్ ట్రైనర్లకు బెంగుళూరులో ఈనెల 10 నుంచి 16 వరకు శిక్షణ అందిస్తారు.