Share News

Aadhaar Seeding: దేవుడికి ఆధార్‌ కష్టాలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:58 AM

రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకూ ఆధార్‌ నంబరు ఉంది. వెబ్‌ల్యాండ్‌లో ఆ భూమిని ఆధార్‌తో అనుసంధానం (సీడింగ్‌) చేయడంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు దక్కుతున్నాయి.

Aadhaar Seeding: దేవుడికి ఆధార్‌ కష్టాలు
Aadhaar Seeding

  • ఆలయ భూములకు ఈ-కేవైసీ సమస్య

  • వెబ్‌ల్యాండ్‌లో అనుసంధానానికి మొబైల్‌ నంబరు కూడా తప్పనిసరి

  • గతంలో పూజారుల ఆధార్‌తో సీడింగ్‌

  • వారికి నిలిచిన ప్రభుత్వ ప్రయోజనాలు

  • తమ ఆధార్‌ను తొలగించాలని వినతులు

  • ఇప్పుడా భూములకు ఆధార్‌ సీడింగ్‌పై రెవెన్యూ, దేవదాయ శాఖల తర్జనభర్జన

  • గుడులకూ ఆధార్‌ ఇవ్వాలన్న సూచనలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకూ ఆధార్‌ నంబరు ఉంది. వెబ్‌ల్యాండ్‌లో ఆ భూమిని ఆధార్‌తో అనుసంధానం (సీడింగ్‌) చేయడంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు దక్కుతున్నాయి. మరి దేవుడి భూములను సీడింగ్‌ చేయడమెలా? రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవుళ్ల పేరిట ఉన్న లక్షలాది ఎకరాల భూములను వెబ్‌ల్యాండ్‌, పీఏం కిసాన్‌ పోర్టల్‌, అన్నదాత సుఖీభవలో చేర్చాలంటే ఆధార్‌ తప్పనిసరిగా మారింది. మరి దేవుడు దిగొచ్చి ఆధార్‌ తీసుకుంటాడా? తన పేరిట ఉన్న భూములను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం చేసుకుంటాడా? భూముల ఈ-కేవైసీలో వచ్చిన ఈ సరికొత్త సమస్యకు పరిష్కారం ఏమిటో రెవెన్యూ శాఖకు అంతుపట్టడం లేదు.

ప్రతి గుడి పేరిట ఆధార్‌ నంబరు ఇస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యేలా లేదని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల డేటా అంతా వెబ్‌ల్యాండ్‌లో నిక్షిప్తమై ఉంది. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న భూముల రికార్డులన్నీ డిజిటలైజ్‌ చేసి వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచారు. రైతుల భూములతో పాటు వారి బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం చేశారు. ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పంట పెట్టుబడి, రాయితీలు, పంట నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర ప్రయోజనాలు నేరుగా రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. మరి దేవుడి భూముల విషయంలో ఏం చేయాలనేదే ప్రశ్న.


హక్కుదారులుగా అర్చకులు..

రాష్ట్రవ్యాప్తంగా 3.48 లక్షల ఎకరాలకు పైగా దేవుడి మాన్యం ఉంది. ఇందులో ప్రముఖ ఆలయాలతో పాటు చిన్న గుడులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు లక్ష ఎకరాల ఆలయ భూమి ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఇక నమోదైన దానిలో 48 వేల కేసుల్లో ఆలయ భూమి అర్చకుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. భూములకు తప్పనిసరిగా ఆధార్‌ సీడింగ్‌ చేయాలని గతంలో ప్రభుత్వం రెవెన్యూ శాఖకు టార్గెట్‌ విధించింది. దీంతో 100 శాతం సీడింగ్‌ జరిగిందని చెప్పుకోవడానికి కొన్ని ఆలయ భూములను వేంకటేశ్వర స్వామి, శివయ్య స్వామి, గణపతి స్వామి, ఆంజనేయ స్వామి... ఇలా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. హక్కుదారుల కింద ఆయా ఆలయాల్లో కైంకర్యాలు చేసే అర్చకుల పేర్లు రాసి, వారి ఆధార్‌ నంబర్‌ను సీడింగ్‌ చేశారు. దీనివల్ల వారికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరిగింది.

ఒక్కో ఆలయానికి 20 నుంచి 60 ఎకరాలకు పైగా భూములు ఉండటంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదు. 15 ఎకరాలలోపు భూములన్న ఆలయాల పూజారులకు రైతుభరోసా వంటివి వారి ఖాతాల్లో పడినా ఇలా లబ్ధి పొందినవారు తక్కువ మంది ఉన్నారు. అధిక భూములున్నాయనే పేరిట ప్రభుత్వ పథ కాలు, ఇతర లబ్ధిని కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆలయ భూములతో అనుసంధానమైన తమ ఆధార్‌, మొబైల్‌ నంబర్లను తొలగించాలని రెవెన్యూ శాఖకు అర్చకులు పెద్దఎత్తున విన్నపాలు చేసుకుంటున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే తమ ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌ డేటాతో డీలింక్‌ చేసుకున్నారు. దీంతో ఆ భూములు మరోసారి ఆధార్‌ సీడింగ్‌ జరగాల్సిన జాబితాలోకి వచ్చాయి. వాటికి ఆయా దేవుడి ఆలయాల పేరిట ఆధార్‌ ఇవ్వాలా? లేక దేవదాయ శాఖకు ప్రత్యేక ఆధార్‌ నంబరు ఇవ్వాలా? అన్న చర్చ జరుగుతోంది.


ఆధార్‌ ఉంటేనే సీడింగ్‌..

వెబ్‌ల్యాండ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ సీడింగ్‌ కాని భూములను ప్రత్యేకమైనవిగా చూపిస్తోంది. వాటికి సీడింగ్‌ జరగాలంటే భూములున్న ప్రతీ దేవుడి పేరిట ఆధార్‌ నంబర్‌ తీసుకోవాలి. దానితో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ కూడా ఉండాలి. ఇందుకోసం దేవుళ్లు కూడా ఆధార్‌ నమోదు కేంద్రానికి వె ళ్లి తమ వేలిముద్రలు, ఐరిస్‌, ఇతర డేటా ఇచ్చి, ఓ ఫొటో దిగి ఆధార్‌ తీసుకోవాలని రెవెన్యూ అధికారులు చమత్కరిస్తున్నారు.

ఇక గుడి పేరిట ఆధార్‌ ఇవ్వడం అయ్యే పని కాదని చెబుతున్నారు. దీంతో దేవుడి భూములకు ఆధార్‌ ఎలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై తేల్చాలని దేవదాయ శాఖను రెవెన్యూశాఖ కోరింది. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని లక్ష ఎకరాలతో పాటు, పూజారుల పేరిట ఉన్న భూముల విషయంలోనూ సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.


కౌలు రైతులకు నష్టమే..

అన్నదాత సుఖీభవ పథకం కోసం ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ డేటాను పునఃపరిశీలన చేస్తోంది. ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? ఆధార్‌ సీడింగ్‌ ఎలా జరిగిందని మరోసారి పరిశీలిస్తోంది. దీంతోపాటు పీఎం-కిసాన్‌ కోసం ప్రతీ కమతం వివరాలను అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు నమోదు కాని వాటిలో ఎక్కువగా ఆలయ భూములే ఉన్నాయి. వాటిని వెబ్‌ల్యాండ్‌లో, పీఎం- కిసాన్‌లో అప్‌డేట్‌ చేయకపోతే, ఆ భూముల్లోని కౌలు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 19 , 2025 | 10:06 AM