Share News

Revenue Department: ప్రజా పిటిషన్లకు ఆధార్‌ తప్పనిసరి

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:29 AM

ప్రజల నుంచి పిటిషన్ల స్వీకరణలో కీలక మార్పులు తీసుకురావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇచ్చే అర్జీల వాస్తవికతను తెలుసుకునేందుకు, ఆ తర్వాత ఆ అంశం పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు...

Revenue Department: ప్రజా పిటిషన్లకు ఆధార్‌ తప్పనిసరి

  • భూ సమస్యలకు సర్వే నంబర్‌

  • పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే ప్రతి ఫిర్యాదుపైనా

  • సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు ఉండాలి

  • ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజల నుంచి పిటిషన్ల స్వీకరణలో కీలక మార్పులు తీసుకురావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇచ్చే అర్జీల వాస్తవికతను తెలుసుకునేందుకు, ఆ తర్వాత ఆ అంశం పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రతీ పిటిషన్‌పై తప్పనిసరిగా పిటిషనర్‌ ఆధార్‌ నంబర్‌ నమోదు చేసే విధానం తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించింది. పిటిషన్‌పై ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ఉంటే వాస్తవికతను తెలుసుకుని, నిర్దిష్ట కాలవ్యవధిలో సమస్య పరిష్కారం కోసం ఆయా శాఖలు పనిచేస్తాయని, దీని వల్ల డూప్లికేషన్‌ సమస్య కూడా ఉండదని రెవెన్యూ శాఖ నివేదించినట్లు తె లిసింది. భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే పిటిషన్లపై తప్పనిసరిగా సంబంధిత రైతు భూమి సర్వే నంబర్‌ ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కూటమి సర్కారు ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సెల్‌ సిస్టమ్‌-పీజీఆర్‌ఎ్‌స)ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో సామాన్యులు, రైతులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఇతరులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోరుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విన్నపాలు వచ్చాయి. ఇవన్నీ ఐదారు లక్షలపైనే ఉన్నాయి. ఇందులో 80 శాతం రెవెన్యూవే ఉన్నాయని గుర్తించారు. ఇవికాకుండా రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా మరో 2.80 లక్షల పిటిషన్లు వచ్చాయి. కొన్నింటిలో స్పష్టత కొరవడింది. పిటిషన్లలో భూమి సమస్యలు రాశారు కానీ సర్వే నంబర్‌, ఇతర వివరాలేవీ పొందుపరచలేదు. కొన్ని లక్షల పిటిషన్లపై వ్యక్తుల పేర్లు ఉన్నాయి కానీ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ లేవు. దీంతో వాటి పరిష్కారం ప్రభుత్వ శాఖలకు పెద్ద పనిగా మారింది. పిటిషన్లు పరిష్కరించామని రెవెన్యూ శాఖ నివేదికలు ఇస్తుంటే, క్లోజ్‌ చేసిన అంశాలపై అవే విన్నపాలు పదేపదే వస్తున్నాయి.


దీంతో సమస్యల పరిష్కారం సరిగ్గా జరగడం లేదని, క్షేత్రస్థాయి సమస్యలు ఎక్కడివక్కడే ఉంటున్నాయన్న భావన ప్రభుత్వ పెద్దల్లో నెలకొంది. తమకొచ్చే విన్నపాల్లో సింహభాగం డూప్లికేషన్‌, స్పష్టత లేనివే ఉంటున్నాయని రె వెన్యూ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి విరుగుడుగా కీలక ప్రతిపాదనలు చేసింది. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత వ్యక్తి పేరు, అడ్రస్‌, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వేదికల నుంచి తీసుకునే విన్నపాల్లో ఇవి ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీనివల్ల పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే పిటిషన్లలోని వాస్తవికత తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. పిటిషన్‌లోని అంశం తీవ్రమైనది అయితే వెంటనే పరిష్కారం కోసం తక్షణ ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఆ పిటిషన్‌ను పరిష్కరించాక నేరుగా సంబంధిత వ్యక్తితో మాట్లాడి సమస్య పరిష్కారమైందా? లేదా? తెలుసుకునే అవకాశం ఉంటుందని, దీనివల్ల పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే ప్రజాస్పందన ఎలా ఉందో మరింత స్పష్టంగా తెలుస్తుందని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు ఇచ్చే పిటిషన్లలో తప్పనిసరిగా రైతు ఊరు, ఆధార్‌, ఖాతా నంబర్‌తో పాటు సర్వే నంబర్‌ను తప్పనిసరిగా జత చేయించాలని ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనల అమలుతో ఫిర్యాదుల్లో పారదర్శకత, వాస్తవికత ఉంటాయని, నిజమైన సమస్యలన్నీ కాలనుగుణంగా పరిష్కారం అవుతాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Updated Date - Sep 27 , 2025 | 04:30 AM