Share News

నిధుల గోల్‌మాల్‌!

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:42 AM

నాగాయలంక మండల పరిషత, గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులు ఆన్‌లైన్‌ చేసే ఓ ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేతివాటం ప్రదర్శించాడు. అభివృద్ధి పనులకు సంబంధించి వారం క్రితం మంజూరైన బిల్లుల నిధులు సుమారు రూ.60 లక్షలను పంచాయతీ ఖాతాల నుంచి తన సొంత ఖాతాకు తరలించాడు. విషయం తెలిసి పంచాయతీ కార్యదర్శులు నిలదీసేందుకు ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు.

నిధుల గోల్‌మాల్‌!

-నాగాయలంక మండల పరిషతలో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి చేతివాటం

- అధికారుల లాగిన్‌తో వ్యక్తిగత ఖాతాకు పంచాయతీల నిధుల మళ్లింపు

-రూ.60 లక్షల వరకు స్వాహా చేసినట్టు అనుమానం!

-అజ్ఞాతంలో ఆపరేటర్‌.. తలలు పట్టుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

- పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు

నాగాయలంక మండల పరిషత, గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులు ఆన్‌లైన్‌ చేసే ఓ ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేతివాటం ప్రదర్శించాడు. అభివృద్ధి పనులకు సంబంధించి వారం క్రితం మంజూరైన బిల్లుల నిధులు సుమారు రూ.60 లక్షలను పంచాయతీ ఖాతాల నుంచి తన సొంత ఖాతాకు తరలించాడు. విషయం తెలిసి పంచాయతీ కార్యదర్శులు నిలదీసేందుకు ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు.

అవనిగడ్డ, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

నాగాయలంక మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీల్లో నిర్వహించే అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు పదేళ్ల క్రితం ఓ యువకుడిని అనధికారికంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించుకున్నారు. అతనికి పంచాయతీ కార్యదర్శులు తమ జీతం నుంచి ప్రతీ నెల ఇంత అని ముట్టచెబుతూ, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌, ట్రెజరీ పనులకు వినియోగించుకుంటున్నారు. అతను మండల పరిషత కార్యాలయం ఆవరణలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవల బిల్లులు మంజూరు కాగా, పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లోకి వెళ్లి సదరు ఉద్యోగి ఆయా పంచాయతీ ఖాతాల్లో నుంచి తన సొంత ఖాతాకు, తనకు సంబంధించిన బంధువుల ఖాతాలకు భారీ మొత్తాలను బదలాయించుకున్నట్టు తెలిసింది. మండల పరిషత పాలకవర్గానికి సంబంధించి ఓ ముఖ్య నేత చేసిన పనులకు రూ.20 లక్షల మేర బిల్లులు రావాల్సి ఉంది. తాజాగా ఇటీవల ఆ బిల్లులు విడుదలయ్యాయని, సదరు మొత్తాన్ని కాంట్రాక్టర్‌ ఖాతాకు జమ చేయకుండా, ఆ ఉద్యోగి తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లుగా సమాచారం. మండలంలోని ఆరు పంచాయతీల లావాదేవీలన్నింటినీ సదరు ఉద్యోగే నిర్వహిస్తుండటంతో మొత్తం ఎంత మేర నిధులను అతను బదలాయించుకున్నాడన్న విషయమై మండల పరిషత ఉద్యోగులు గోప్యంగా విచారణ చేస్తున్నారు.

రేపల్లె కేంద్రంగా సాగిన వ్యవహారం

మండల పరిషత కార్యాలయంలో ప్రైవేట్‌గా పని చేస్తున్న సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ రేపల్లె కేంద్రంగా నిధులు మళ్లింపునకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. రేపల్లెలో సదరు ఉద్యోగి సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని సాయంత్రం సమయంలో పంచాయతీ ఉద్యోగులతో కలసి అక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తుండే వాడని, అయితే వారం క్రితం విడుదలైన డబ్బు కాంట్రాక్టర్‌ ఖాతాలకు వెళ్లకుండా సదరు ఉద్యోగి ఖాతాకు వెళ్లినట్లు ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు గుర్తించి, నిలదీసేందుకు ప్రయత్నించగా, సదరు ఉద్యోగి అదృశ్యమైనట్లు సమాచారం. సదరు ఉద్యోగి పూర్తిస్థాయిలో వ్యవహారాలు చూసే ఆరు పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు రేపల్లె వెళ్లి అతని కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి అక్కడ ఉన్న రికార్డులను జాగ్రత్తగా వెనక్కి తెచ్చుకున్నట్లు తెలిసింది. వక్కపట్లవారిపాలెం గ్రామానికి సంబంధించి రూ.2.60 లక్షలతోపాటు మరో ఐదు పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల బిల్లులు దారి మళ్లించటంతో కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు లబోదిబో మంటున్నారు. మండ పరిషత పాలకవర్గానికి చెందిన రూ.20 లక్షల బిల్లులు కూడా గోల్‌మాల్‌ అయినట్లుగా సమాచారం. సదరు ప్రజాప్రతినిధి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మండల నేత భోగాది వెంకట శేషగిరిరావు ఎంపీడీవో జి.సుధాప్రవీణ్‌కు ఈ నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు చేయగా, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులను సదరు ప్రైవేటు ఉద్యోగి దారి మళ్లించినట్లు సమాచారం. అజ్ఞాతంలో ఉన్న ఆ ఉద్యోగి దొరికితేనే గానీ ఎంత మొత్తంలో నిఽధులు దారిమళ్లాయో తెలిసే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఎంపీడీవో సుధా ప్రవీణ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది.

Updated Date - Jul 22 , 2025 | 12:42 AM