Share News

రోడ్డెక్కిన పొగాకు రైతు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:16 AM

రైతులకు పొగాకు సాగు శాపంగా మారింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పొగాకును కొనుగోలు చేసేందుకు అలయన్స కంపెనీ అధికారులు నాణ్యత లోపాన్ని చూపుతున్నారు.

   రోడ్డెక్కిన పొగాకు రైతు
రోడ్డుపై పొగాకుకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న పొగాకు రైతులు

అమ్మేందుకు వెళ్తే నాణ్యత లేదంటూ వెనక్కి

పొగాకును రోడ్డుపై వేసి నిప్పు పెట్టి నిరసన

కేజీ రోడ్డుపె స్తంభించిన ట్రాఫిక్‌

రైతుల పట్ల వివక్ష చూపలేదన్న కంపెనీ ప్రతినిధులు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు పొగాకు సాగు శాపంగా మారింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పొగాకును కొనుగోలు చేసేందుకు అలయన్స కంపెనీ అధికారులు నాణ్యత లోపాన్ని చూపుతున్నారు. వెనక్కి పంపుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులకు తమ ఇష్టం వచ్చినట్లుగా ధరలో కోతలు విధిస్తూ అధికారులు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు చేయాలని రైతులు నిలదీస్తే నాణ్యతలోపం ఉంది, ఇస్తే తక్కువ ధరకు ఇవ్వండి లేదంటే మీచావు మీరు చావండి అంటూ రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం నందికొట్కూరు మార్కెట్‌ యార్డు సమీపంలోని గోదాము వద్ద తమకు మద్దతు ధర ఇవ్వలేదంటూ కేజీ రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి నిప్పుపెట్టి రైతులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కంపెనీ నిర్వాహకులు నాణ్యత పేరుతో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని వాపోయారు. పొగాకు బేళ్లను తీసుకొచ్చిన ప్రతి సారి తమకు ధరలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇది ఒక్క రోజు మాత్రమే కొనుగోలు చేస్తామని కంపెనీ సిబ్బంది చెబుతున్నారని దీంతో తమ వద్ద ఉన్న బేళ్లను ఎవరు కొంటారని రైతులు వాపోతున్నారు. అనంతరం కంపెనీ అధికారులు రైతులతో మాట్లాడుతూ తాము మాత్రం నాణ్యతను బట్టి కంపెనీ నిబంధనల మేరకే ధరను నిర్ణయిస్తున్నామే తప్ప రైతుల పట్ల ఎలాంటి పక్షపాతం చేపడం లేదని అలయన్స కంపెనీ మేనేజర్‌ విజయ్‌ తెలిపారు.

Updated Date - Apr 24 , 2025 | 12:16 AM