నదిలో ‘హంస’ విహరించేనా!
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:16 AM
విజయదశమి రోజున కృష్ణానదిలో హంస విహరిస్తుందా? అసలు ఉత్సవమూర్తులు ఈసారి ఊరేగింపుగా హంస ఎక్కుతారా? దశమి గడియలు దగ్గర పడుతున్న వేళ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవి. గడచిన మూడేళ్లుగా తెప్పోత్సవానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం వరద పరిస్థితి నేపథ్యంలో తెప్పోత్సవంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దశమి రోజున అమ్మవారి తెప్పోత్సవంపై ఉత్కంఠ!
కృష్ణానదిలో క్రమంగా పెరుగుతున్న వరద
ఎగువ నుంచి 6.39 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
7 లక్షల క్యూసెక్కులకు చేరువలో వరద ప్రవాహం
ఎన్‌వోసీ ఇవ్వడానికి జలవనరుల శాఖ నిరాకరణ
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
విజయదశమి రోజున కృష్ణానదిలో హంస విహరిస్తుందా? అసలు ఉత్సవమూర్తులు ఈసారి ఊరేగింపుగా హంస ఎక్కుతారా? దశమి గడియలు దగ్గర పడుతున్న వేళ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవి. గడచిన మూడేళ్లుగా తెప్పోత్సవానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం వరద పరిస్థితి నేపథ్యంలో తెప్పోత్సవంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయదశమి రోజున శ్రీగంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ప్రధానాలయంలో పూజలు చేసి ఊరేగింపుగా కనకదుర్గానగర్ నుంచి దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులతో నదీ విహారం చేయిస్తారు. ఏటా ఈ ప్రక్రియ సాగుతోంది. 2022, 2023 సంవత్సరాల్లో దశమి రోజున హోరున వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ఉత్సవమూర్తులను మహామండపంలోని ఆరో అంతస్తులో ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గడచిన ఏడాది వరద ఉధృతి కొనసాగడంతో నదీ విహారాన్ని నిలుపుదల చేశారు. హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి బ్యారేజీకి 6.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ వరద ప్రవాహం బుధవారానికి ఏడు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ 70 గేట్లలో 69 గేట్లను పూర్తిస్థాయికి ఎత్తి మొత్తం వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. రెండు రోజులుగా ఇన్‌ఫ్లో ఆరు లక్షల క్యూసెక్కుల వద్ద నికరంగా ఉంది. ఈ వదర ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫోర్‌కాస్ట్ విడుదల చేశారు. దశమికి ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉండటంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులు హంస వాహనాన్ని సిద్ధం చేయిస్తున్నారు. గడచిన ఏడాది కృష్ణా నదికి వరద కొనసాగిప్పటికీ హంస వాహనంపై పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి జలవనరుల శాఖ అధికారులు నిరభ్యంతర ధ్రువీకరణపత్రం ఇచ్చారు. నాడు వరద ప్రవాహం 70వేల క్యూసెక్కులకు లోపున ఉండడం వల్ల విహారాన్ని అనుమతించకుండా పూజా కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులు దాటడంతో పూజా కార్యక్రమాలను హంస వాహనంపై అనుమతించలేమని అధికారులు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే ఈ ఏడాది దసరాలో తెప్పోత్సవం రద్దవుతుంది. దశమి రోజున నిర్వంచాల్సిన తెప్పోత్సవం ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా మూడు సార్లు రద్దయిందని దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి.