Share News

పెద్దాసుపత్రిలో ఆధిపత్య పోరు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:39 PM

పెద్దాసుపత్రిలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లు విషయం ఇద్దరు అధికారుల మధ్య వాదనకు దారితీసింది.

   పెద్దాసుపత్రిలో ఆధిపత్య పోరు

ఇద్దరు అధికారుల మధ్య కోల్డ్‌వార్‌

నలిగిపోతున్న వైద్య సిబ్బంది

వాదనకు దారితీసిన బిల్లు విషయం

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పెద్దాసుపత్రిలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లు విషయం ఇద్దరు అధికారుల మధ్య వాదనకు దారితీసింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పాలన వ్యవహారాలకు సంబంధించిన ఓఅధికారి తనకు అన్ని చెప్పాల్సిందేనని ఒకరు.. నిబంధనల ప్రకారం తాను కీలకమైన అధికారినంటూ మరో అధికారి.. ఇలా ఇద్దరి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు

పాలన వ్యవహారాలు చూసే ఓఅధికారి, హాస్పిటల్‌ వ్యవహారాలు చూసే మరో అధికారి. ఇద్దరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ పెథాలజీ డిపార్టుమెంట్‌లో సీడీఎస్‌ నిధుల కింద రూ.లక్షతో పనులు చేపట్టేందుకు కేఎంసీ ప్రిన్సిపాల్‌ మంజూరు చేశారు. ఈపనులు పూర్తయ్యాక వ్యయం లక్షకు కాస్త ఎక్కువైంది. ఈ విష యం పెథాలజీ హెచవోడీ, ప్రిన్సిపాల్‌కు ఓఅధికారికి చెప్పడంతో గ్రీనసిగ్నల్‌ ఇచ్చారు. అదనపు బడ్జెట్‌ బిల్లుపై అధికారులు కూడా సంతకాలు చేశారు. వారం రోజుల క్రితం ఇద్దరు అధికారులు ఓ బిల్లుకు సంబంధించిన విషయంపై కేఎంసీ ప్రిన్సిపాల్‌ను కలవడానికి ఒకే కారులో బయలుదేరారు. అదనపు బడ్జెట్‌ బిల్లు విషయం తనకు ఎందుకు చెప్పలేదని అధికారి మరో అధికారిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆఫైల్‌ మీరు కూడా చూశారని, సంతకం కూడా పెట్టారని సమాధానం చెప్పడంతో ఆ అధికారికి చిరెత్తికొచ్చినట్లు సమాచారం. ఈ బిల్లు ప్రిన్సిపాల్‌ ఆమోదం తెలిపారని చెప్పడంతో తనకు చెప్పకుండా ఎలా సంతకం పెట్టించారంటూ వాదనకు దిగారు. దీంతో ఆఅధికారి కూడా తానేమీ అటెండర్‌ను కాదని, గెజిటెడ్‌ ఆఫీసర్‌ను అని, ఫైల్‌ను మీ దగ్గరకు పంపించామని, మీకు ఆ ఫైల్‌పై అభ్యంతరాలు ఉంటే డిస్కస్‌ అని రాయాలని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రగిలిపోయిన అధికారి మరో అధికారిని కారులో ఎక్కించుకోకుండా హాస్పిటల్‌కు బయలుదేరినట్లు సమాచారం. ఇలా ప్రతిరోజూ ఇద్దరు అధికారుల మద్య కర్నూలు జీజీహెచలో రావణకాష్టంగా మాదిరిగా తయారైంది.

విదేశీ పర్యటన అంశంపైనే..

జీజీహెచలోని ఓ అధికారి నాలుగు నెలల క్రితం ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆఫీసర్‌ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆ అధికారి ప్రభుత్వ అనుమతుల్లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లి రావడంతో మరో అధికారికి ఆయుధం చిక్కినట్లయింది. ఈవిషయాన్ని పదే పదే ప్రశ్నించినట్లు తెలిసింది.

ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు..

ఆసుపత్రిలో ఓ అధికారికి ప్రభుత్వం అద్దె వాహనాన్ని సమకూర్చి ప్రతి నెల రూ.45వేలు బిల్లు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈఅద్దె వాహనం కర్నూలు లేదా ఆఫీసు పని ఉంటే మన రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లవచ్చు. సదరు అధికారి అధికారిక విధులకు వాడాల్సిన వాహనాన్ని స్వంత అవసరాలకు వినియోగిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ అద్దె వాహనానికి సంబంధించిన బిల్లును పెండింగ్‌లో పెట్టడంతో ఇద్దరి అధికారుల మధ్య వివాదం మొదలైంది. ఈబిల్లు పెట్టడంలో కొంత జాప్యం చేయడంతో అధికారి ససేమిరా అనడంతో అప్పటి నుంచి ఇద్దరు అధికారుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరి అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆసుపత్రి ఉద్యోగులు, వైద్యులు నలిగిపోతున్నారు. వైద్యవిద్య ఉన్నతాధికారులు కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఇద్దరి అదికారుల మద్య కోల్డ్‌వార్‌ను నివారించాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.

ఎలాంటి గొడవలు లేవు

కర్నూలు సర్వజన వైద్యశాలలో ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌పై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కే.వెంకటేశ్వర్లును ‘ఆంధ్రజ్యోతి’ కోరగా ఎలాంటి గొడవలు లేవన్నారు. పాలనాపరంగా చిన్నచిన్న విషయాలు ఉంటాయని, ఈ విషయాన్ని ఆయన కొట్టి పారేశారు.

ఫ డాక్టర్‌ కే.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, జీజీహెచ, కర్నూలు

Updated Date - Aug 29 , 2025 | 11:39 PM