Share News

యువతకు ఆదర్శం.. సురవరం

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:56 PM

యువతకు ఆదర్శం సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు.

   యువతకు ఆదర్శం.. సురవరం
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ

ఉద్యమాలతో ఎంతో ఎదిగారు :

మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌

పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా :

సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌

సురవరం సుధాకర్‌రెడ్డికి ఘన నివాళి

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): యువతకు ఆదర్శం సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా సమితి అధ్వర్యంలో జిల్లా పరషత సమావేశ భవనంలో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డితో కలిసి ఉద్యమంలో పనిచేయడమే కాకుండా తన కుటుంబానికి బంధుత్వం సైతం ఉందన్నారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరితో ఉండే సుధాకర్‌రెడ్డి అందరినీ కలుపుకుపోయే గుణం ఉదన్నారు. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాలు యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.రామచంద్రయ్య అన్నారు. విద్యార్థి ఉద్యమాలతో పాటు జిల్లాలోని మలగవెళ్లిలో భూపోరాటం చేసి సుమారు 1100 ఎకరాలు పేదలకు పంపిణీ చేయడంలో సుధాకర్‌రెడ్డి కీతకపాత్ర అన్నారు. అనంతరం సురవరం మిత్రులు రామచంద్రారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, వైసీపీ జిల్లా అద్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురవరం గీతామాధురి, కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కేవీ.సుబ్బారెడ్డి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సూర్యనారాయణరెడ్డి, భీమలింగప్ప, రాష్ట్ర కార్యవర్గసభ్యులు కే.రామాంజనేయులు, జిల్లా సహయ కార్యదర్శులు ఎస్‌.మునెప్ప, లెనినబాబు, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

సురవరం గొప్పనేత : టీజీ వెంకటేష్‌

సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప నేత అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. పార్టీలు, సిద్ధాంత పరమైన విభేదాలున్నా వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రేమగా ఉండేవారని అన్నారు. నగరం నుంచి ఉద్యమాలు ప్రారంభించి చివరకు జాతీయ స్థాయిలో పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పని చేశారన్నారు. అలాంటి వ్యక్తికి కర్నూలు నగరంలో ఆయన పేరు నిలిచిపోయేలా చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా తనవంతు సహయ సహకారాలు అందిస్తామని అన్నారు.

పేదల పక్షాన నిలిచిన : ఎంఎ గఫూర్‌

పేద పక్షాలన నిలిచిన వామపక్ష యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌ అన్నారు. ధనిక కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన పోరాటం చేశారని కొనియాడారు. నిత్యం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండి పోరాటం చేశారన్నారు. చిరునవ్వుతో అందరిని పలకరించడం సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరికి సొంతమన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 11:56 PM