Share News

దర్జాగా బుసక దందా!

ABN , Publish Date - May 30 , 2025 | 01:08 AM

అతను ఓ బీసీ నాయకుడు. వైసీపీ తరఫున తోట్లవల్లూరు పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయాలని తలంచాడు. ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేశాడు. తీరా సర్పంచ్‌ పదవి ఎస్సీలకు రిజర్వు కావటంతో సర్పంచ్‌గా పోటీ చేయలేకపోయాడు. వైసీపీ మూలాలు ఉన్న సదరు వ్యక్తి తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరులో అక్రమంగా బుసక క్వారీ నడపటం, స్థానిక టీడీపీ నాయకులు అతనికి మద్దతుగా నిలవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ నాయకుడి అక్రమంగా బుసక క్వారీ ఏర్పాటుకు సీఎంవోలోని ఓ ప్రముఖ వ్యక్తి అండదండగా నిలిచినట్టు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుడు ఇంత ధైర్యంగా అక్రమంగా బుసక క్వారీ నిర్వహించటంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

దర్జాగా బుసక దందా!

- కృష్ణానదీ పాయలో వైసీపీ నాయకుడి నిర్వాకం

- సీఎంవోలోని ప్రముఖ వ్యక్తి నుంచి అండదండలు!

- మద్దతుగా నిలుస్తున్న స్థానిక టీడీపీ నాయకులు

- చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

- బుసక లారీలను పోలీసులు పట్టుకోవడంతో విషయం వెలుగులోకి..

అతను ఓ బీసీ నాయకుడు. వైసీపీ తరఫున తోట్లవల్లూరు పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయాలని తలంచాడు. ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేశాడు. తీరా సర్పంచ్‌ పదవి ఎస్సీలకు రిజర్వు కావటంతో సర్పంచ్‌గా పోటీ చేయలేకపోయాడు. వైసీపీ మూలాలు ఉన్న సదరు వ్యక్తి తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరులో అక్రమంగా బుసక క్వారీ నడపటం, స్థానిక టీడీపీ నాయకులు అతనికి మద్దతుగా నిలవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ నాయకుడి అక్రమంగా బుసక క్వారీ ఏర్పాటుకు సీఎంవోలోని ఓ ప్రముఖ వ్యక్తి అండదండగా నిలిచినట్టు ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుడు ఇంత ధైర్యంగా అక్రమంగా బుసక క్వారీ నిర్వహించటంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

తోట్లవల్లూరు, మే 29 (ఆంధ్రజ్యోతి):

తోట్లవల్లూరు మండలం రొయ్యూరు రెవెన్యూ పరిధిలోని కృష్ణానదీపాయలో వైసీపీ నాయకుడు ఒకరు అనధికార బుసక క్వారీ నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వల్లూరుపాలెం పాతర్యాంపు నుంచి కృష్ణానదీపాయలో రొయ్యూరు వైపుకు కిలోమీటరు పొడవున బాట నిర్మించి, అక్రమ బుసక క్వారీ ఏర్పాటు చేశారు. ఈ బాట నిర్మాణ సమయంలో తోట్లవల్లూరుకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు ఆ వైసీపీ నాయకుడికి మద్దతుగా నిలబడ్డారని విమర్శలు వస్తున్నాయి. రైతుల నుంచి 3.30 ఎకరాల పట్టాభూమి తీసుకుని బుసక తవ్వకాలు చేపట్టారు. బుధవారం రాత్రి అక్రమంగా తరలి వెళ్తున్న బుసక లారీలను పోలీసులు నిలువరించటంతో వ్యవహారం బయటకువచ్చింది. ఈ విషయమై వల్లూరుపాలెం గ్రామస్తులు విలేకరులకు సమాచారం అందించారు. గురువారం ఈ అక్రమ బుసక క్వారీ వద్దకు మీడియా వెళ్లగా ఎక్స్‌కవేటర్‌ ఖాళీగా నిలిపి ఉంది. పోలీసుల హెచ్చరికతో తవ్వకాలను తాత్కాలికంగా ఆపారని తెలిసింది. అక్కడ సుమారు 30 సెంట్లలో అక్రమంగా బుసక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఎక్కుగా బుసక తవ్వకాలు చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఇసుక లారీల మాటున అక్రమంగా బుసక లారీలను నడుపుతున్నారని సమాచారం.

సీఎంవోలో ఎవరా వ్యక్తి?

రొయ్యూరులో వైసీపీ నాయకుడు అక్రమంగా బుసక క్వారీ నడపటం వెనుక సీఎంవోలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అండగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎంవోలోని వ్యక్తి జోక్యం ఉండటం వల్లే వైసీపీ నాయకుడు ధైర్యంగా బాట నిర్మించి అక్రమంగా క్వారీ ఏర్పాటు చేయగలిగాడని విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాగా, వైసీపీ నాయకుడితో స్నేహం ఉన్న టీడీపీ నాయకులు ఇద్దరు నేరుగా క్వారీలోకి వెళ్లి అండగా నిలబడినట్టు తెలిసింది. అందువల్లే రెవెన్యూ యంత్రాంగం అక్రమ క్వారీ వైపు కన్నెత్తి చూడటంలేదని సమాచారం. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుడు అనధికార బుసక క్వారీ ఏర్పాటు చేయటం, కొందరు అధికారులు వత్తాసు పలకటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇసుక, బుసక అక్రమాలను సహిందిలేదని సీఎంచంద్రబాబు చేసిన హెచ్చరికలను అధికారులు పెడచెవిన పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

బసక క్వారీకి అనుమతి లేదు : తహసీల్దార్‌

రొయ్యూరు బుసక క్వారీపై తహసీల్దార్‌ ఎం.కుసుమ కుమారిని వివరణ కోరగా, బుసక క్వారీకి అనుమతి లేదని చెప్పారు. తాము ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదన్నారు. తమకు ఈరోజే తెలిసిందని, సిబ్బందిని పంపి బుసక తవ్వకాలను ఆపివేయిస్తామని వివరించారు.

Updated Date - May 30 , 2025 | 01:08 AM