ముదురుతున్న వివాదం
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:04 AM
కృష్ణా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగించే అంశం ఇంకా కొలిక్కిరాలేదు. వారి పనితీరును అంచనా వేసేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ర్టార్ ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణా వర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులు, అధికారుల మధ్య రగడ
26వ తేదీ వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆదేశాలు
హాజరుకాబోమని స్పష్టం చేసిన అధ్యాపకులు
ఇంటర్వ్యూల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపణ
మంత్రి నారా లోకేశ్‌ను కలిసే యోచన
గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
కృష్ణా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగించే అంశం ఇంకా కొలిక్కిరాలేదు. వారి పనితీరును అంచనా వేసేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ర్టార్ ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ తమ పనితీరును అంచనా వేసేందుకు కాదని, తమను పొమ్మనలేక పొగ బెట్టేందుకేనని కాంట్రాక్టు అధ్యాపకులు అంటున్నారు. తమ స్థానంలో కొత్త వారిని నియమించుకునే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పనితీరును అంచనా వేసేందుకు ఇన్నేళ్ల తర్వాత ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఇంటర్వ్యూలకు ఆయా సబ్జెక్టుల వారీగా హాజరుకావాల్సిన తేదీల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఈ నెల 19న కెమిస్ర్టీ, ఫిజిక్స్, 21న కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం, మేథమెటిక్స్, అప్లైడ్ మేథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 23న బయోకెమిసీ్ట్ర, 25న ఇంగ్లీష్, 26న ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వీరు వచ్చే సమయంలో గతేడాదిలో సమర్పించిన కనీసంగా రెండు జర్నల్స్‌ను తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇన్నేళ్లు ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండానే కొనసాగించిన అధికారులు ఇప్పుడు ఇంటర్వ్యూలు పెట్టడం తమను ఇబ్బంది పెట్టడానికేనని గ్రహించిన కాంట్రాక్టు అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరుకాలేదు. ఎవరూ హాజరుకాబోమని యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్‌ల వద్ద స్పష్టం చేశారు. దీంతో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు నియమించిన సబ్జెక్టు నిపుణులు వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్లిపోయారు. దీంతో యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు అంశం గందరగోళంగా మారింది. దీంతోపాటు యూనివర్సిటీలో అధ్యాపకుల జీతభత్యాలు, పదోన్నతుల అంశాలను పర్యవేక్షించే రెక్టార్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ ఇంటర్వ్యూల ఆదేశాలు జారీ చేయడం కూడా వివాదాస్పమైంది. దీంతో ఈ విధానంపై రెక్టార్‌కు అండగా యూనివ ర్సిటీలో పనిచేసే రెగ్యులర్ ప్రొఫెసర్‌లు నిలబడ్డారు.
వర్సిటీకి నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ లేఖ
వర్సిటీకి అనుబంధంగా ఉన్న నూజివీడు పీజీ సెంటరులో పనిచేసే వారంతా కాంట్రాక్టు అధ్యాపకులే. వీరు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల 18వ తేదీ నుంచి మూకుమ్మడిగా విధులకు హాజరుకావడం లేదని, దీంతో పీజీ సెంటరులో పాఠ్యాంశాల బోధన, ఇతరత్రా పరిపాలనాపరమైన అంశాలు నిలిచిపోయాయని పీజీ సెంటరు ప్రిన్సిపాల్ జె.నవీన లావణ్య లత యూనివర్సిటీకి మెయిల్ ద్వారా సమాచారం పంపారు. నూజివీడు పీజీ సెంటరుతో పాటు, కృష్ణా యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులు తమ సమస్య పరిష్కారమయ్యే వరకు విధులకు దూరంగానే ఉంటున్నారు. ఒకవైపు పీజీ కోర్సుల్లో నూతనంగా విద్యార్థినీ విద్యార్థులు చేరుతున్నారు. వారు యూనివర్సిటీకి వచ్చిన కొద్ది రోజులకే పాఠ్యాంశాల బోధన నిలిచిపోవడంతో వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.
ఈ ఏడాది ఇంక్రిమెంట్‌లు బంద్!
కాంట్రాక్టు అధ్యాపకులకు ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ వేస్తారు. ప్రస్తుతం పనితీరును అంచనా వేసేందుకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాని వారికి ఈ ఏడాది ఇంక్రిమెంట్ ఇవ్వబోమని ఇటీవల జరిగిన చర్చల్లో యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. ఇంక్రిమెంట్ సంగతి తర్వాత.. ముందు జూన్ నెల జీతం ఇవ్వాలని కాంట్రాక్టు అధ్యాపకులు పట్టుబట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు మిన్నకుండిపోయారని అంటున్నారు. యూనివర్సిటీలో పనిచేసే సీనియర్ కాంట్రాక్టు అధ్యాపకులను కాదని, జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులుగా నియమించే కుట్ర జరుగుతోందని, ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి వివరిస్తామని, యూనివర్సిటీ అధికారుల తీరుపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టు అధ్యాపకులు చెబుతున్నారు.