Share News

వేధిస్తున్న సిబ్బంది కొరత

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:58 AM

రైల్వేలో ఇంజనీరింగ్‌ విభాగాన్ని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఒక పక్క కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నారు. మరో పక్క ఽథర్డ్‌ రైల్‌ పనులు కొనసాగుతున్నాయి. అయినా అవసరానికి అనుగుణంగా సిబ్బంది మాత్రం ఉండటం లేదు. దీనికి ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు సూపర్‌వైజర్ల అవినీతే కారణంగా తెలుస్తోంది. అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో అరకొరగా సిబ్బందిని తీసుకుని, ఎక్కువ మందిని తీసుకున్నట్టు చూపి వారి జీతాలను పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. దీంతో ఉన్నవారి మీదనే పనిభారం పడుతోంది.

వేధిస్తున్న సిబ్బంది కొరత

-రైల్వే ఇంజనీరింగ్‌ విభాగంలో ఇష్టారాజ్యం

- ట్రాక్‌ మెయింట్‌నెన్స్‌కే సరిపోని సిబ్బంది

- మూడో లైన్‌ అదనపు పనులకు కటకట

- ఉన్న వాళ్లను ఇళ్లల్లో పనిచేయించుకుంటున్న సూపర్‌ వైజర్లు

- అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో అవినీతి దందా!

రైల్వేలో ఇంజనీరింగ్‌ విభాగాన్ని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఒక పక్క కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నారు. మరో పక్క ఽథర్డ్‌ రైల్‌ పనులు కొనసాగుతున్నాయి. అయినా అవసరానికి అనుగుణంగా సిబ్బంది మాత్రం ఉండటం లేదు. దీనికి ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు సూపర్‌వైజర్ల అవినీతే కారణంగా తెలుస్తోంది. అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో అరకొరగా సిబ్బందిని తీసుకుని, ఎక్కువ మందిని తీసుకున్నట్టు చూపి వారి జీతాలను పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. దీంతో ఉన్నవారి మీదనే పనిభారం పడుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో కొంత కాలంగా విజయవాడ - గూడూరు, విజయవాడ - కాజీపేట సెక్షన్లలో మూడవ లైన్‌, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌ మెయింట్‌నెన్స్‌ పనులు ఉండనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రెగ్యులర్‌ మెయింట్‌నెన్స్‌ పనులు చేయటానికే ఇంజనీరింగ్‌ విభాగం.. సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. మూడోలైన్‌ పనులకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారో.. దానికి అనుగుణంగా సిబ్బంది కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అధికారులు ఆ పని చేయటం లేదు. రెగ్యులర్‌ మెయింట్‌నెన్స్‌ పనులలో కీమెన్‌, గ్యాంగ్‌మెన్‌ వంటి సిబ్బంది సేవల అవసరం ఎక్కువుగా ఉంటుంది. ట్రాక్‌ మెయింట్‌నెన్సర్స్‌ తగినంత సంఖ్యలో లేకపోవటంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇళ్లల్లో పనులుకు కొందరు..

ఇంజనీరింగ్‌ సూపర్‌ వైజర్ల వ్యవహారశైలి వల్ల కూడా పరోక్షంగా తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బందిలో కొందరిని సూపర్‌ వైజర్లు తమ ఇళ్లల్లో పనులు చేయించుకుంటున్నారని తెలిసింది. మిగులు సిబ్బందిలో డబ్బులు సమర్పించుకునే వారికి పెద్దగా పనిలేని డ్యూటీలు అంటే వాచ్‌మెన్లుగా వేయటం జరుగుతోంది.

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పేరుతో అవినీతి మేత!

ట్రాక్‌ వెంబడి పనిచేసే సిబ్బంది కొరతను అధిగమించటం కోసం అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తీసుకుంటున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానం అన్నది సూపర్‌వైజర్స్‌కు కామధేనువుగా మారింది. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో తీసుకున్నట్టుగా చెబుతున్న వారందరూ.. క్షేత్ర స్థాయిలో పనిచేయడంలేదు. సంతకాలు పెట్టుకుని జీతాలను పక్కదారి పట్టిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ మెయింట్‌నెన్స్‌ పనులలో భాగంగా ట్రాక్‌ మెషీన్లు వచ్చినా కూడా సిబ్బందితోనే పనిపడుతోంది. ఈ ట్రాక్‌ మెషీన్లు ఒక్కోసారి 21 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. దూర ప్రాంతాలు వెళ్లి అక్కడే ఉండాల్సి వస్తుంది. పనులు లేని సమయంలో కూడా సిబ్బంది వాటి దగ్గరే ఉండాలి. దీంతో సిబ్బందికి తగిన విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతోంది.

జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ను పక్కన పెట్టేశారు!

క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ను గతంలో ఇచ్చేవారు. జీపీఎస్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో అవినీతి సూపర్‌ వైజర్స్‌ బాగోతాలు బయటపడతాయన్న ఉద్దేశ్యంతో వాటికి తెలివిగా ముగింపు పలికారు. జీపీఎస్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ సరిగా పనిచేయటం లేదని, పరికరాలు నాణ్యతగా లేవని వాటికి ఉద్వాసన పలికారు.

మొబైల్‌ అప్లికేషన్‌ పేరుతో సిబ్బంది వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారు!

రైల్వే ఇంజనీరింగ్‌ విభాగంలో క్షేత్ర స్థాయిలో ట్రాక్‌ మీద పనిచేసే వారికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. వారి దగ్గర స్మార్ట్‌ ఫోన్లు ఉన్నా.. ఫోన్ల వాడకం తప్ప మిగిలిన వాటి గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. ట్రాక్‌ వర్క్‌ చేస్తున్న వారిని పర్యవేక్షించే పేరుతో.. మొబైల్‌ యాప్‌ తయారు చేశారు. ఈ యాప్‌ను వారి ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసి జీపీఎస్‌ను ట్రాక్‌ చేస్తున్నారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ మీద సరైన అవగాహన చాలా మందికి లేకపోవటం వల్ల డ్యూటీలలో లేని సమయాలలో కూడా వారి కదలికలు ఏమిటన్నది సూపర్‌ వైజర్లు తెలుసుకుంటున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:58 AM