రాజకీయ ప్రచార అస్త్రమే!
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:36 AM
గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణాజిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ శ్రీహరిరావు హత్యోదంతం రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితమవుతుంది కానీ దర్యాప్తు ముందుకు సాగటం లేదని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో ఈ కేసు విషయమై స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడటంతో ఈ విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

- డాక్టర్ శ్రీహరిరావు హత్యోదంతంపై వీడని మిస్టరీ
- గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఉండగానే హత్య
- నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు
- 8 నెలల కిందట సీఐడీ విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
- నేటి వరకు ముందుకు సాగని విచారణ
- గురువారం అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
- నియోజకవర్గంలో మరోమారు చర్చనీయాంశంగా హత్యోదంతం
అవనిగడ్డ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణాజిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ శ్రీహరిరావు హత్యోదంతం రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితమవుతుంది కానీ దర్యాప్తు ముందుకు సాగటం లేదని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో ఈ కేసు విషయమై స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడటంతో ఈ విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరున్న డాక్టర్ కోట శ్రీహరిరావు 2020 నవంబరు 27వ తేదీన హత్యకు గురయ్యారు. సీసీ కెమెరాలు దాటుకుని ఇంట్లోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారయ్యారు. అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లోని సీసీ కెమెరాల్లో కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని పోలీసులు ప్రకటించారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుకు అత్యంత సన్నిహితులు, మాజీ వ్యాపార భాగస్వామి అయిన డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు దర్యాప్తు వేగంగా జరిగి, హత్య చేయించిన దుండగులను నాటి ప్రభుత్వం పట్టుకుంటుందని అందరూ భావించినప్పటికీ దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ క్రమంలో డాక్టర్ శ్రీహరిరావు హత్యోదంతం వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమైంది కానీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈ హత్యపై సమగ్రమైన దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారు.
8 నెలల క్రితం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినా..
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ గత ఏడాది జూలై 30వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఐదేళ్లపాటు మరుగున పడిన ఈ కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి రాబోతుందని అందరూ భావించినప్పటికీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఎనిమిది నెలలు గడిచినా ఇంత వరకు ఈ హత్యకు సంబంధించి విచారణ మొదలు కాలేదు. ఈ తరుణంలోనే వైసీపీకి చెందిన ఓ ముఖ్యనాయకునికి ఈ హత్యతో సంబంధం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై సదరు నేత స్పందిస్తూ తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎనిమిది నెలలుగా విచారణ ముందుకు సాగకపోవటంతో నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేసిన సీఐడీ విచారణ ప్రకటనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శాసన సభ దృష్టికి హత్య కేసు
ఈ నేపథ్యంలో శాసనసభ దృష్టికి శ్రీహరిరావు హత్య కేసును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం తీసుకొచ్చారు. ఈ కేసును సీఐడీకి అప్పగించారు కానీ విచారణ ప్రారంభం కాలేదంటూ హత్యకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఈ హత్యోదంతం విచారణకు ఉన్న అడ్డంకులు తొలగించి హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు ఉపకరిస్తుందా? లేక ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమవుతుందా? అన్న ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.