జోగి మెడకు బిగుస్తున్న ఉచ్చు!
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:11 AM
అగ్రిగోల్డ్ భూముల కబ్జా, అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. తనయుడు, సోదరుడిని తెరపై పెట్టి రాష్ట్ర హోం డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించు కోవటంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవమని తేలింది. రెవెన్యూ, ఏసీబీశాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సీఐడీకి చేరింది.
- ఆ భూములు అగ్రిగోల్డ్‌వే!
- రెవెన్యూ, ఏసీబీ ఉమ్మడి తనిఖీలో వెల్లడి
- తాజాగా సీఐడీకి సమగ్ర నివేదిక అందజేత
- హోమ్ డిపార్ట్‌మెంట్ అటాచ్‌లో ఉన్న భూములు అగ్రిగోల్డ్ వేనని నిర్ధారణ
- ఆ భూములనే రిజిస్ర్టేషన్ చేయించుకుని విక్రయానికి శ్రీకారం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అగ్రిగోల్డ్ భూముల కబ్జా, అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. తనయుడు, సోదరుడిని తెరపై పెట్టి రాష్ట్ర హోం డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించు కోవటంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవమని తేలింది. రెవెన్యూ, ఏసీబీశాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సీఐడీకి చేరింది. రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలనలో కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణకు సంబంధించిన సమగ్ర రిపోర్టును ఏసీబీకి, సీఐడీకి తాజాగా అందించారు. సంయుక్త విచారణ రిపోర్టు ‘ఆంధ్రజ్యోతి’ చేతికి చిక్కింది. జోగి రమేష్ తనయుడు, సోదరుడు పేరిట రిజిస్ర్టేషన్ చేయించుకుని, వేరేవారికి విక్రయించటం చెల్లుబాటు కాదని రెవెన్యూ, ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది. ఆ భూములు ముమ్మాటికీ అగ్రిగోల్డ్‌వని తేల్చింది. పదకొండు పేజీలతో కూడిన సమగ్ర నివేదిక ఈ భూములకు సంబంధించిన వాస్తవాలు ఏమిటన్నది తహసీల్దార్ సుగుణ నివేదికలో వెల్లడించారు.
నివేదికలో ఏముందంటే..
ఏసీబీ, రెవెన్యూ అధికారుల సంయుక్త పరిశీలనలో తేలిన అనేక అంశాలను నివేదికలో పొందుపరిచారు. అంబాపురం గ్రామం ఆర్‌ఎస్ నెంబర్ 87లోని 2293.05 చదరపు గజాల భూమిని పెద పాడు పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 3/2015 ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 133, 117లను అనుసరించి రాష్ట్ర హోం డిపార్ట్‌మెంట్ అటాచ్ చేసిందని పేర్కొంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారని, వాటికి సంబంధించిన దస్తావేజుల నెంబర్లు 869/2002, 870/2002, 871/2002, 872/2002, 873/2002, 874/2002, 3945/2002, 1730/2002, 1496/2002 ద్వారా అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు, వారి కుటుంబ సభ్యులు కలిగి ఉన్నారని పేర్కొనటం జరిగింది. ఈ డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుని నాన్ అప్రూవల్ లే అవుట్ ప్రకారం ప్లాట్లను పరిశీలించగా.. అంబాపురం గ్రామ రెవెన్యూ రికార్డుల దాఖలా ఆర్‌ఎస్ నెంబర్ 69/2, 87 సర్వే నెంబర్లలో భాగమై ఉన్నాయని పేర్కొన్నారు. నాన్ అప్రూవల్ ప్లాట్లను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన క్రమంలో వాటి విస్తీర్ణాలను కొలిచినట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాత అవ్వా వెంకట శేషు నారాయణ డాక్యుమెంట్‌ను పరిశీలించిన మీదట జోగి రమేశ్ కూల్చేయించిన గోడ అవ్వ డాక్యుమెంట్ స్థలంలోనే ఉందని గుర్తించారు. అవ్వ కుటుంబ సభ్యులైన అవ్వా వెంకట కృష్ణ లాలస, అవ్వ అపురూప, వెంకట వీణసంతోషి, అవ్వ పుష్పలత, అవ్వా వెంకట సాయి కిరణ్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించగా, వారి ప్లాట్ల పరిధిలో ప్రహరీ గోడ ఉందని నిర్ధారించారు. ఈ స్థలం వెంబడి ఉన్న గుంటక ఆదిలక్ష్మి, కావూరి వసుంధర, గుండు వెంకటేశ్వరరావు, పోతుల హరికిశోర్, కలం బుజ్జిబాబు, దాసరి చెన్నం నాయుడు, సురేష్ గురజార్, దేవరాజుగట్టు బెనర్జీ, పోలవరపు మురళీ, పోలవరపు మురళీమోహన్, రామిశెట్టి రాంబాబు, దవరా మహిపాల్ జయశుక్, పగిడిపాటి సుబ్బారెడ్డి వంటి వారికి సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించటంతో పాటు, వారిని పూర్తి స్థాయిలో విచారించటం జరిగింది. ఈ విచారణలో వీరి స్థలాల హద్దులలో వివిధ దిక్కులలో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు. కాబట్టి పెదపాడు పోలీసు స్టేషన్ కేసుకు సంబంధించి హోమ్ డిపార్ట్‌మెంట్ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రి గోల్డ్ భూములేనని తేల్చటం జరిగింది. దీంతో జోగి రమేశ్ తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ రిజిస్ర్టేషన్ చేయించుకోవటం, వాటిని తిరిగి వేరే వారికి విక్రయించటం వంటివి పూర్తిగా అక్రమమని సంయుక్త విచారణ కమిటీ తేల్చింది. వీరు ఇచ్చిన నివేదిక సీఐడీకి చేరటంతో.. తదుపరి దర్యాప్తు ప్రక్రియను ఇక సీఐడీ ప్రారంభించనుంది.