‘శాతవాహన’లో సర్కారు భూమంటూ కొత్తవాదన
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:15 AM
శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఇంకా ప్రభుత్వ భూమి ఉందంటూ కొంతమంది కొత్తవాదనను తీసుకొస్తున్నారని బోయపాటి అప్పారావు మనువడు శ్రీనివాస శ్రీకృష్ణ, న్యాయవాది కె.భానుప్రసాద్ అన్నారు.
ఫకరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాతే కూల్చాం
న్యాయపరంగా పోరాటం చేస్తాం
బోయపాటి శ్రీనివాస్ శ్రీకృష్ణ, న్యాయవాది భానుప్రసాద్
విజయవాడ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఇంకా ప్రభుత్వ భూమి ఉందంటూ కొంతమంది కొత్తవాదనను తీసుకొస్తున్నారని బోయపాటి అప్పారావు మనువడు శ్రీనివాస శ్రీకృష్ణ, న్యాయవాది కె.భానుప్రసాద్ అన్నారు. విజయవాడ మొగల్రాజపురంలో వారు మీడియాతో ఆదివారం మాట్లాడారు. శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి కోనేరు లక్ష్మయ్య మొదటి కార్యదర్శిగా పనిచేశారన్నారు. అప్పారావు, లక్ష్మయ్యల మధ్య స్నేహం ఉండడంతో ల్యాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి రావడంతో ఆ భూమిని సొసైటీకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ చేశారని చెప్పారు. గుండవరపు ప్రజాపతిరావు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వేర్వేరుగా రెండు దావాలను రెండు కోర్టుల్లో దాఖలు చేశారన్నారు. వాటిని కోర్టులు డిస్మిస్ చేశాయని, తర్వాత హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ సొసైటీతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2011వ సంవత్సరానికి ముందు వరకు ఆలపాటి ఏనాడూ శాతవాహన ప్రాంగణంలో అడుగుపెట్టలేదని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లను ఉపసంహరించు కుంటున్నట్టు వంకాయలపాటి కామేశ్వరరావు, ప్రజాపతిరావు మోమోలు దాఖలు చేయడంతో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈపీ (ఎగ్జిక్యూషన్ పిటిషన్)కు కోర్టు నుంచి అనుమతి తీసుకోకుండా ఎలా భూమిలోకి ప్రవేశిస్తారని కొంతమంది అసంబద్ధ వాదన చేస్తున్నారన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిన్నమనేని కృష్ణమోహన్ కలిసి మొత్తం కథను నడిపిస్తున్నారని ఆరోపించారు. శాతవాహన కళాశాల అక్కడ నిర్వహించడం లేదని, అందులో విద్యార్థులు లేరని స్పష్టం చేశారు. సొసైటీ ఈ భూమిని ఎగ్జిబిషన్లకు ఇచ్చుకుని డబ్బులు సంపాదిస్తోందన్నారు. పిన్నమనేని కృష్ణమోహన్ ఈ భూమిని లీజుకు తీసుకున్నట్టు కాకినాడ, ఇతర ప్రాంతాల్లో రిజిసే్ట్రషన్లు చేయించారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు.