Share News

కి‘లేడీ సింగర్‌’!

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:44 AM

ఆమె తన మధురమైన గానంతో నగరంలోని ఓ పబ్‌లో పాడుతుంది. అక్కడకు వచ్చే వారిని తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని.. భర్తతో విడిపోయానని.. ఒంటరిగా ఉంటున్నానని వలపు వల విసురుతుంది. అందులో చిక్కుకున్న వారితో ఏడడుగులు వేస్తుంది. ఆ తర్వాత వారిని దోచుకుని మరొకరితో వివాహానికి సిద్ధమవుతోంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున అరడజను మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఈ కిలాడి సింగర్‌ పబ్‌లో జరిగిన ఓ గొడవ విషయమై పోలీసులను ఆశ్రయించి అడ్డంగా బుక్కైంది.

కి‘లేడీ సింగర్‌’!

-నగరంలోని ఓ పబ్‌లో విధులు

-ధనవంతులతో పరిచయాలు

-ఒంటరిగా ఉంటున్నానని వలపు వల

-వారితో పెళ్లి.. భారీగా డబ్బు వసూలు

-ఒకే నెలలో ఇద్దరిని వివాహం చేసుకున్న మాయలేడి

-పబ్‌లో గొడవపై సీఐని ఆశ్రయించిన సింగర్‌, మరో వ్యక్తి

-పోలీస్‌ విచారణలో సింగర్‌ పెళ్లిళ్ల గుట్టురట్టు

-అరడజను మందిని పెళ్లిళ్లు చేసుకున్న సింగర్‌

-పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి భార్య

ఆమె తన మధురమైన గానంతో నగరంలోని ఓ పబ్‌లో పాడుతుంది. అక్కడకు వచ్చే వారిని తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని.. భర్తతో విడిపోయానని.. ఒంటరిగా ఉంటున్నానని వలపు వల విసురుతుంది. అందులో చిక్కుకున్న వారితో ఏడడుగులు వేస్తుంది. ఆ తర్వాత వారిని దోచుకుని మరొకరితో వివాహానికి సిద్ధమవుతోంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున అరడజను మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఈ కిలాడి సింగర్‌ పబ్‌లో జరిగిన ఓ గొడవ విషయమై పోలీసులను ఆశ్రయించి అడ్డంగా బుక్కైంది.

వన్‌టౌన్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి):

నగరంలోని కృష్ణలంకకు చెందిన ఓ మహిళ (40)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యభర్తల గొడవ నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. ఆమె విజయవాడ బందరు రోడ్డులోని ఓ పబ్‌లో సింగర్‌గా పనిచేస్తుంది. ఆమె వ్యవహారశైలి నచ్చకపోవటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటిలో నుంచి పంపించి వేశారు. మొదట్లో యనమలకుదురులో ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో ఉండేది. ప్రస్తుతం పటమటలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటుంది. పబ్‌కు వచ్చే డబ్బున్న వారితో పరిచయం పెంచుకుని వారిని ట్రాప్‌ చేసేది. తాను భర్తతో విడాకులు తీసుకున్నానని చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహాలు చేసుకున్నట్లు సమాచారం. ఆమె సుమారు అరడజను మందిని వివాహమాడినట్టు తెలిసింది. వీరిలో వివాహితులు, అవివాహితులు ఉన్నట్టు సమాచారం.

ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఇరుక్కుపోయింది..

ఇంత వరకు ఆమె ఆటలు బాగానే సాగాయి. అయితే పబ్‌లో రెండు, మూడు గ్రూపులు ఉండటంతో ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఒక గ్రూపునకు చెందిన వ్యక్తితో ఆమె గొడవ పడింది. ఈ వ్యవహారాన్ని సింగర్‌, ఆమె పెళ్లి చేసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తి కలిసి ఇటీవల బందరు రోడ్డులోని ఎస్‌ఎస్‌ కళ్యాణ మండపం వద్ద విధుల్లో ఉన్న సీఐ దగ్గరకు వెళ్లి పబ్‌లో జరుగుతున్న గొడవ గురించి చెప్పారు. స్పందించిన సీఐ పబ్‌పై నిఘా పెట్టమని కిందిస్ధాయి సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి పబ్‌ తెరచి ఉంటుందని సమాచారం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో అక్కడకు వెళ్లారు. సింగర్‌ వ్యవహారశైలిపైన అనుమానం ఉండటంతో సింగర్‌ను, ఆమె పెళ్లిచేసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తిని కూడా స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. ఈ విచారణలో సింగర్‌ వ్యవహారం బయట పడింది. వారిద్దరిని పోలీసులు విచారణ నిమిత్తం రెండు మూడు రోజుల పాటు స్టేషన్‌కు పిలిపించటంతో అతను ఇంటికి వెళ్లలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆరా తీయటంతో అతను సింగర్‌ను పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది. అతని భార్య పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. సీఐ రహస్యంగా ఈ వ్యవహారాన్ని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

జూన్‌ 5న ఒకరితో, 27న మరొకరితో పెళ్లి..

పోలీసుల దర్యాప్తులో సింగర్‌ జూన్‌ 5వ తేదీన వన్‌టౌన్‌కు చెందిన వ్యక్తిని దుర్గగుడిలో, అదే నెల 27వ తేదీన పోరంకికి చెందిన వ్యక్తిని సింహాచలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. వీరు కాకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవటానికి సింగర్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సింగర్‌ వివాహం చేసుకున్న వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుకున్నట్లు కూడా సమాచారం. సింగర్‌ వివాహం చేసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తి తరచూ పబ్‌కి వెళుతూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడినంటూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె కూడా అతని సహాయం ఎక్కువ పొందవచ్చని ఉద్దేశంతో వివాహం చేసుకుందని తెలిసింది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అతని స్నేహితులు చెబుతున్నారు. సింగర్‌ మాయలో పడి సుమారు అరడజను మందికి పైగా మోసపోవటమే కాకుండా ఆర్థికంగా నష్టపోయారని పబ్‌కు వెళ్లే పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఆమె కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటకు చెందిన వ్యక్తి భారీగా వేడుకలు చేసినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. సుమారు ఆమెకు అతను కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు ఇచ్చినట్లు అతని స్నేహితులు బహిరంగంగా చెబుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 01:44 AM