Share News

వైభవంగా పూర్ణాహుతి, వసంతోత్సవం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:53 AM

ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానంలో జరుగుతున్న చైత్రమాస కల్యాణ బ్రహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి వైభవంగా జరిగింది.

వైభవంగా పూర్ణాహుతి, వసంతోత్సవం

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానంలో జరుగుతున్న చైత్రమాస కల్యాణ బ్రహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి వైభవంగా జరిగింది. అనంతరం వేదోక్త, శాస్ర్తోకంగా ధాన్యకొట్నోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి అవభృత స్నానం (పవిత్ర కృష్ణానదిలో) కోసం గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరులను అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా ఆలయ స్థానాచార్యుడు వి.శివప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో కృష్ణానదికి తీసుకువెళ్లి, పుణ్యనదిలో అవభృత స్నాన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతి, ధాన్యకొట్నోత్సవం, తదితర కార్యక్రమాల్లో దేవదాయ శాఖ కమిషనర్‌, దుర్గగుడి ఈవో కె.రామచంద్ర మోహన్‌ దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

కృష్ణానదిలో ఆది దంపతుల విహారం

ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గగుడిలో జరుగుతున్న చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గంగా, పార్వతీ (దుర్గా) మల్లేశ్వర స్వామి కృష్ణానదిలో ఫంటుపై నదీ విహారం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు సాయంత్రం 5 గంటలకు మల్లేశ్వరాలయం నుంచి దేవ దేవేరీలను ఊరేగింపుగా దుర్గాఘాట్‌ కృష్ణానది వద్దకు తీసుకువెళ్లారు. వేదమంత్రాలు, మంగళవాయుద్యాల నడుమ మహామండపం నుంచి కూచిపూడి నృత్యకారుల నృత్యం, తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గాఘాట్‌కు చేరుకున్నారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఫంటుపై స్వామివారు, అమ్మవారులను అధిరోహింపజేశారు. అనంతరం కృష్ణానదిలో అమ్మవార్లు, స్వామివారి నదీ విహారం ప్రారంభమైంది. కల్యాణోత్సవ ఆది దంపతులను కృష్ణానదిలో విహరింపజేశారు. స్థానాచార్యుడు వి.శివప్రసాద్‌ శర్మ, వేద పండితులు, అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:53 AM