నిండా ముంచిన తుపాను
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:15 PM
తుపాను ప్రభావంతో బుధవారం చాగలమర్రి మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
నీట మునిగిన పంట పొలాలు
తడిసిన మొక్కజొన్న ధాన్యం
ఆందోళనలో రైతులు
చాగలమర్రి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తుపాను ప్రభావంతో బుధవారం చాగలమర్రి మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. 17.7 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాన వర్షంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రహదారులపై ఆరబెట్టుకున్న మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. పెద్దబోదనం, చిన్నబోదనం, గొట్లూరు, ముత్యాలపాడు, గొడిగనూరు, చాగలమర్రి గ్రామాల్లోని రహదారుల్లో 2 వేల క్వింటాళ్లు పైగా ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి దెబ్బతినిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పిలువకుండానే పలకరించే వర్షాల ధాటికి రైతులు కుదేలవుతున్నారు. పంట కోత దశకు రావడంతో కొద్ది రోజులుగా వీటిని కొందరు తొలగించగా మరి కొందరు అదే పనుల్లో ఉన్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా వీటిని నూర్పిడి చేసుకొని గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం కష్టంగా మారింది. రైతన్నను పదే పదే తుపాన వర్షాలు వెంటాడుతున్నాయి. పంట సాగుకు చేసిన ఖర్చు కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గొట్లూరు, నేలంపాడు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి నీటిలోనే కుళ్లిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.