మొక్కుబడి!
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:18 AM
జిల్లాలో అటవీశాఖ అధికారుల తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మడ అడవుల పెంపకంలో భాగంగా సముద్ర తీరానికి దూరంగా మొక్కలు నాటించాల్సి ఉంటే అలలు వచ్చే చోట యంత్రాలతో నాటి మమ అనిపించారు. దీంతో సముద్రం ఆటుపోట్లకు ఆ మొక్కలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. రూ.లక్షల ప్రజాధనం కడలిపాలయ్యింది. ఈ వ్యవహారంలో అధికారులు భారీ స్థాయిలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గం మెట్లపల్లి రిజర్వు ఫారెస్టులోనూ ఇదే తంతు నడిచిందని విమర్శలు ఉన్నాయి.
- మడ అడవుల పెంపకంలో అటవీశాఖ నిర్వాకం
- గిలకలదిండి, పల్లి తుమ్మలపాలెం తీరంలో యంత్రాలతో నాటిన మొక్కలు
- అలల ధాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన వైనం
- పాటించని నిబంధనలు.. రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం
- మెట్లపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహారం
జిల్లాలో అటవీశాఖ అధికారుల తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మడ అడవుల పెంపకంలో భాగంగా సముద్ర తీరానికి దూరంగా మొక్కలు నాటించాల్సి ఉంటే అలలు వచ్చే చోట యంత్రాలతో నాటి మమ అనిపించారు. దీంతో సముద్రం ఆటుపోట్లకు ఆ మొక్కలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. రూ.లక్షల ప్రజాధనం కడలిపాలయ్యింది. ఈ వ్యవహారంలో అధికారులు భారీ స్థాయిలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గం మెట్లపల్లి రిజర్వు ఫారెస్టులోనూ ఇదే తంతు నడిచిందని విమర్శలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
బందరు మండలం గిలకలదిండి, కోన బీట్ పరిధిలోని పల్లి తుమ్మలపాలెం (సాల్ట్ ఫ్యాక్టరీ సమీపం) ప్రాంతాల్లో గతేడాది ఆగస్టులో అటవీశాఖ అధికారులు మడ అడవుల పెంపకం చేపట్టారు. అలలు వచ్చే చోట మడ మొక్కలను నాటారు. కోన బీట్ పరిధిలో తుమ్మలపాలెం ప్రాంతంలో కూడా సముద్ర అలలకు అత్యంత సమీపంలో మడ మొక్కల పెంపకం చేపట్టారు. అయితే మడ అడవుల పెంపకం కానీ, అడవుల్లో మొక్కలు నాటడానికి అటవీశాఖ కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్), ఇకో టూరిజం డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్ (ఈడీసీ) ఆధ్వర్యంలో మొక్కల పెంపకం పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు యాంత్రీకరణ విధానంలో చేయకూడదు. కేవలం కేంద్ర అటవీశాఖ నిబంధనల మేరకు కూలీలతోనే చేయించాల్సి ఉంది. వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్), ఈడీసీల చైర్‌పర్సన్, అటవీశాఖ జాయింట్ బ్యాంక్ అకౌంట్‌కు నిధులు జమ చేస్తారు. వీరు కలిసి డబ్బులను డ్రా చేసి పనిచేసిన కూలీలకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను అస్సలు పాటించకుండా అటవీశాఖ అధికారులు ప్రొక్లెయిన్లను వినియోగించి మొక్కలు నాటినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. నిర్దేశిత హెక్టార్ల కంటే తక్కువుగా నాటించి.. బిల్లులు మాత్రం మొత్తానికి పెట్టి సొమ్ము చేసుకున్నారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
అలలకు కొట్టుకుపోయాయి..
గిలకలదిండి, తుమ్మలపాలెం దగ్గర వేయించిన మడ మొక్కలు ప్రస్తుతం మచ్చుకు కూడా కనిపించటం లేదు. ఈ మొక్కలు నాటేటప్పుడే స్థానికులు సముద్రానికి దగ్గరగా నాట వద్దని చనిపోతాయని చెప్పినా వినలేదని పలువురు పేర్కొంటున్నారు. సముద్రం ఆటు పోట్లకు గురైనపుడు సముద్రం ముందుకు వస్తుంది. ఉధృతి ఎక్కువుగా ఉంటుంది. అలల ఉధృతి ఎక్కువుగా ఉన్న సందర్భంలో ముందుకు వచ్చిన నీటి వల్ల మడ మొక్కలు చనిపోయాయి. ఆటు పోట్ల నేపథ్యంలో వచ్చిన భారీ సముద్ర ప్రవాహంతో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి.
- మెట్లపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కూడా ఇదే పరిస్థితి
గన్నవరం నియోజకవర్గం మెట్లపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కూడా కృష్ణాజిల్లా అటవీశాఖ అధికారులు చేపట్టిన మొక్కల పెంపకం అపహాస్యానికి గురైంది. ఇక్కడ వీఎస్‌ఎస్, ఈడీసీలతో సంబంధం లేకుండానే సొంతంగా అటవీశాఖ అధికారులు మొక్కలను నాటించారు. ఇలా చేయటం వల్ల మొక్కల పెంపకంలో పారదర్శకత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలకు తోడు .. ఇక్కడ కూడా ప్రొక్లెయిన్లతోనే మొక్కలు నాటించారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా నాటిన మొక్కల్లో 70 శాతం పైగా చనిపోయాయి.