Share News

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం!

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:27 AM

గత వైసీపీ ప్రభుత్వంలో విద్రోహ శక్తులు గుడివాడలో విలయతాండవం చేశాయి. అరాచకాలు, అక్రమాలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై దృష్టి సారించింది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన గడ్డం గ్యాంగ్‌, వైసీపీ మూకలపై కొరడా ఝుళిపించింది. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని కటకటల వెనక్కి నెట్టింది. ఇదే వరవడిని మరింతగా కొనసాగిస్తోంది.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం!

- గత వైసీపీ హయాంలో లెక్కలేనన్న అరాచకాలు

- నేరాల కట్టడికి కూటమి ప్రభుత్వం చర్యలు

- తొలుత మాజీ మంత్రి కొడాలి నాని గడ్డం గ్యాంగ్‌పై దృష్టి

- తాజాగా బెట్టింగ్‌ డాన్‌ వినోద్‌పై రౌడీషీట్‌

గత వైసీపీ ప్రభుత్వంలో విద్రోహ శక్తులు గుడివాడలో విలయతాండవం చేశాయి. అరాచకాలు, అక్రమాలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై దృష్టి సారించింది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన గడ్డం గ్యాంగ్‌, వైసీపీ మూకలపై కొరడా ఝుళిపించింది. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని కటకటల వెనక్కి నెట్టింది. ఇదే వరవడిని మరింతగా కొనసాగిస్తోంది.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత వైసీపీ హయాంలో గుడివాడలో అక్రమాలు, అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నాని గడ్డం గ్యాంగ్‌ సభ్యులు, ముఖ్య అనుచరులు ఒక్కొక్కరిపై అధికారులు చర్యలు ప్రారంభించారు. పోలీసులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛనివ్వడంతో వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలో గుడివాడలో గడ్డం గ్యాంగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వినోద్‌పై రౌడీషీట్‌లను తెరచి కఠిన చర్యలు తీసుకున్నారు.

గతంలో ఆడిందే ఆట..

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ అల్లరి మూకలు, కొడాలి నాని గడ్డం గ్యాంగ్‌ సభ్యులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. టీడీపీ కార్యాలయాలు, వాహనాలు, ర్యాలీలపై దాడులకు తెగబడ్డారు. భూకబ్జాలకు పాల్పడి ఆస్తులను దోచుకున్నారు. ఏమి చేయకున్నా టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించి జైలుపాలు చేశారు. వైసీపీ నాయకులు దాడులకు తెగబడినా, కవ్వింపు చర్యలకు దిగినా నాడు పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

కూటమి ప్రభుత్వం రాకతో మార్పు

కూటమి ప్రభుత్వం రాకతో గుడివాడలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయి. 2022, డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్‌ రోజున టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళీ, అతని గ్యాంగ్‌ పెట్రోల్‌ సంచులు, కర్రలు, రాడ్‌లతో హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే రావి ఫిర్యాదు మేరకు హత్యాయత్నానికి పాల్పడిన 17మందిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేయడం, వారిని రిమాండ్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి. జైలు నుంచి విడుదల అయ్యాక ఇద్దరు, ముగ్గురు గుడివాడలో ఉండగా, మిగిలిన వారు గుడివాడ వదిలి హైదరాబాదు, బెంగళూరులో నివాసముంటున్నారు.

వినోద్‌పై రౌడీషీట్‌

గత వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని అండదండలతో ఆయన ముఖ్య అనుచరుడు కూనసాని వినోద్‌ రెచ్చిపోయాడు. పెద్ద ఎత్తున పేకాట, క్రికెట్‌ బెట్టింగులు నిర్వహించాడు. నానితో ఉన్న సత్సంబంధాలతో వినోద్‌ చేసిన అసాంఘిక కార్యకలాపాల వైపు అప్పటి పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఎట్టకేలకు వినోద్‌ను ఈ నెల 19వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు వినోద్‌పై కేసులు నమోదయ్యాయి. తీరు మారకపోవడంతో ఎట్టకేలకు వన్‌టౌన్‌ పోలీసులు వినోద్‌పై రౌడీ షీట్‌ను తెరిచారు.

Updated Date - Dec 26 , 2025 | 12:27 AM