రైతు స్వప్నం సాకారం
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:19 PM
పత్తికొండ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌తో రైతు స్వప్నం సాకారం కానుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

రూ.11 కోట్లతో టమోటా ప్రాసెసింగ్ యూనిట్
పుచ్చకాయలమాడలో సీఎం చంద్రబాబు హామీ
నిధులతో వచ్చాం..6 నెలల్లో పూర్తి చేస్తాం
టమోటా ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపనలో మంత్రి టీజీ భరత
పత్తికొండ, మార్చి,14(ఆంధ్రజ్యోతి): పత్తికొండ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌తో రైతు స్వప్నం సాకారం కానుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శుక్రవారం పత్తికొండ మండల పరిధిలోని కనకదిన్నె గ్రామం వద్ద రూ.11 కోట్లతో ఏర్పాటు చేయనున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే కేఈ. శ్యాంబాబుతో కలిసి మంత్రి టీజీ భరత ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అధ్యక్షన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా టమోటా పండే పత్తికొండ ప్రాంతంలో టమోటా గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. గత ఏడాది పింఛన్ల పంపిణీ కోసం పుచ్చకాయలమాడ గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు టమోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీని కోసం రూ.11 కోట్ల నిధులతో పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద 2.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 10 నుంచి 12 టన్నుల టమోటాను ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉంటుందని, అలాగే మామిడి, అరటి, బొప్పాయి పంటల ప్రాసెసింగ్ కూడా ఈ యూనిట్ ద్వారా నిర్వహించవచ్చన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే కనకదిన్నె వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షాధార పత్తికొండ ప్రాంతాన్ని మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అందుబాటులో ఉన్న హంద్రీ నీవా నీటిని ఎత్తిపోతల ద్వారా గ్రామ గ్రామానికి తీసుకువచ్చి తాగునీటిని అందించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ అన్ని రకాలుగా వెనుకబడ్డ కర్నూలు జిల్లా పడమటి ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రంజిత బాషా, ఏిపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ గడ్డం శేఖర్‌బాబు, పీడీ ఉమాదేవి, ఆర్డీవో భరతనాయక్, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ బొజ్జమ్మ తదితరులు ఉన్నారు.