Share News

గాడితప్పిన పాలన!

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:31 AM

జిల్లా రెవెన్యూ విభాగంలో పాలన గాడి తప్పింది. ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఉదయం బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చి.. సాయంత్రం ఉపసంహరించుకున్నారు. దీని వెనక ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆర్డీవో కార్యాలయంలో కీలక అధికారిని తప్పించి, పలువురు ఉద్యోగుల పేర్లు ఏసీబీ కేసులో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మచిలీపట్నం నార్త్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు ఇటీవల తారాస్థాయికి చేరాయి. దీంతో అసలు రెవెన్యూ విభాగంలో ఏం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.

గాడితప్పిన పాలన!

-రెవెన్యూ విభాగంపై సర్వత్రా విమర్శలు

-ఉదయం డిప్యూటీ తహసీల్దార్‌ బదిలీ

-సాయంత్రం ఆ ఉత్తర్వుల ఉపసంహరణ

-కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?

-ఏసీబీ కేసులో ఆర్డీవో కార్యాలయం ఉద్యోగుల పేర్లు చేర్చేందుకు రంగం సిద్ధం!

-మచిలీపట్నం నార్త్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తారాస్థాయికి విభేదాలు

జిల్లా రెవెన్యూ విభాగంలో పాలన గాడి తప్పింది. ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఉదయం బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చి.. సాయంత్రం ఉపసంహరించుకున్నారు. దీని వెనక ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆర్డీవో కార్యాలయంలో కీలక అధికారిని తప్పించి, పలువురు ఉద్యోగుల పేర్లు ఏసీబీ కేసులో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మచిలీపట్నం నార్త్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు ఇటీవల తారాస్థాయికి చేరాయి. దీంతో అసలు రెవెన్యూ విభాగంలో ఏం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలోని తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్లతో పాటు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లను ఇటీవల కాలంలో బదిలీ చేస్తూ కలెక్టర్‌ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులు అమలులోకి రాకుండా పలువురు పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు కొందరు ఉద్యోగులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగులు కూడా ఇన్‌చార్జి పోస్టులు కాకుండా పూర్తి బాధ్యతలు ఇస్తేనే సంబంధిత పోస్టుల్లో చేరుతామని చెబుతున్నారని సమాచారం. ఒకటీ రెండు మండలాల్లో తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఆ పోస్టులలో తమను నియమించాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. దీంతో కలెక్టర్‌ ఆచితూచి వ్యవహరించి వివాదాలకు దూరంగా ఉండేవారిని ఆయా మండలాలకు ఇన్‌చార్జిలుగా ఇటీవల కాలంలో నియమించారు.

ఉత్తర్వుల ఉపసంహరణ వెనుక ఏం జరిగింది?

మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ తహసీల్దార్‌ను కృత్తివెన్ను మండలానికి బదిలీ చేస్తూ శనివారం కలెక్టర్‌ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రానికి ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. దీని వెనుక లాబీయింగ్‌ నడిచిందని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని మండలాల్లో వివాదాస్పదంగా మారిన కొందరు డిప్యూటీ తహసీల్దార్‌లను వేరే మండలాలకు బదిలీ చేయాలని ఓ మంత్రి నేరుగా కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ స్పందించి ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను బదిలీ చేయగా, కొద్ది గంటల్లోనే ఆ ఉత్తర్వులను నిలిపివేయడం వెనుక ఏం జరిగిందనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

ఆర్డీవో కార్యాలయంలో కీలక అధికారిపై ఆరోపణలు

మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జూలె 25వ తేదీన ఏసీబీ అధికారులు దాడులు చేసి సీనియర్‌ అసిస్టెంట్‌ బీరం త్రినాథ్‌ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ విషయంలో నగదు ఇస్తామని చెప్పిన కొద్దిసేపటికి ఈ ఫైలుపై సంతకం పెట్టడం జరిగిందని ఏసీబీ అధికారులు ఆ రోజు చెప్పారు. అయితే ఈ కేసులో కీలక అధికారిని పనిగట్టుకుని తప్పించడానికి తెరవెనుక పెద్ద ఎత్తున మంత్రాంగమే నడిచిందని సమాచారం. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే అంశాన్ని గుర్తించిన ఏసీబీ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో కీలకమైనవారిని వదిలివేయడంపై ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరి పేర్లను చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలు!

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నార్త్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలతో పాలన కుంటుపడిందనే విమర్శలు వస్తున్నాయి. పరిపాల నాపరమైన అంశాలు, నగదు పంపకాల్లో తేడాలు వచ్చి ఇటీవల కాలంలో అధికారులు, ఉద్యోగులు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలిసింది. తహసీల్టార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సరెండర్‌ చేసుకోవాలని కలెక్టర్‌కు లేఖరాసే వరకు పరిస్థితి వెళ్లింది. తహసీల్దార్‌ కొద్ది రోజులుగా కార్యాలయానికి వచ్చి, వెంటనే బయటకు వెళ్లిపోతున్నారని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు. బయట ఉండే లాగిన్‌లో వేలిముద్రలు వేస్తున్నారని చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో సెలవు పెట్టిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ తాను ఈ కార్యాలయంలో పనిచేయలేనని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తనను వేరే మండలానికి బదిలీ చేయాలని డీఆర్వోకు ఇటీవల లేఖ ఇచ్చి మళ్లీ సెలవు పెట్టడం గమనార్హం.

కంప్యూటర్‌ ఆపరేటర్‌లను బదిలీ చేస్తారా?

జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎన్నికల విభాగంలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌లు 30 మందిని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఇటీవల బదిలీ చేశారు. దీంతో మిగిలిన తహసీల్దార్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌లను కూడా బదిలీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కాలంలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌లను కలెక్టరేట్‌కు పిలిచి ఎవరెవరు, ఎంతకాలంగా మండలాల్లో పనిచేస్తున్నారు, తదితర వివరాలను సేకరించారు. దీంతో తమను బదిలీలు చేస్తారని కంప్యూటర్‌ ఆపరేటర్‌లు చెప్పుకుంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఎలాగని కొందరు అంటుండగా, కొన్ని మండలాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌లు తాము పనిచేసే మండలంలో పని ఒత్తిడి అధికంగా ఉందని, వేరే మండలాలకు బదిలీ చేస్తే వెళ్లిపోతామని చెబుతున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:31 AM