Share News

గాడితప్పిన పాలన!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:10 AM

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) కార్యాలయంలో పాలన గాడి తప్పింది. కొంతకాలంగా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు, డివిజన్‌ స్థాయి ప్రాజెక్టు అధికారులు, మండల ప్రాజెక్టు అధికారులకు పరిపాలనాపరమైన అంశాల్లో పొసగడం లేదు. దీంతో పాటు మండల, జిల్లా సమాఖ్య నిధులను ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయాలని ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు కొందరు పీడీకి ఎదురు తిరుగుతున్నారు. ఈ క్రమంలో డీఆర్‌డీఏ కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగం డీపీఎంగా వివాదాస్పద అధికారిని నియమించడంతో ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

గాడితప్పిన పాలన!

- డీఆర్‌డీఏ పీడీ సీసీ కనుసన్నల్లోనే జిల్లా కార్యాలయం

- ‘అమరావతి పునర్నిర్మాణ’ బిల్లుల చెల్లింపులో జాప్యం

- ఏపీఎంల బదిలీల్లోనూ ఇష్టారాజ్యం

- డీఆర్‌డీఏ పీడీ తీరుపై కలెక్టర్‌ సీరియస్‌

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) కార్యాలయంలో పాలన గాడి తప్పింది. కొంతకాలంగా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు, డివిజన్‌ స్థాయి ప్రాజెక్టు అధికారులు, మండల ప్రాజెక్టు అధికారులకు పరిపాలనాపరమైన అంశాల్లో పొసగడం లేదు. దీంతో పాటు మండల, జిల్లా సమాఖ్య నిధులను ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయాలని ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు కొందరు పీడీకి ఎదురు తిరుగుతున్నారు. ఈ క్రమంలో డీఆర్‌డీఏ కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగం డీపీఎంగా వివాదాస్పద అధికారిని నియమించడంతో ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :

రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది మే 2వ తేదీన వచ్చారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేయడంతోపాటు, వారికి భోజన వసతులు కల్పించే బాధ్యతను, ఇతరత్రా ఖర్చులను డీఆర్‌డీఏ విభాగమే చూస్తుందని అడిగి మరీ తీసుకున్నారు. భోజన వసతికి సంబంధించి వ్యవహారం పౌరసరఫరాలశాఖ అధికారులు చూడాల్సి ఉండగా, డీఆర్‌డీఏ పీడీ తనకు ఈ పనిని అప్పగించాలని కోరి మరీ తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. ఇందుకు అయ్యే ఖర్చులను మండల సమాఖ్య నిధుల నుంచి ఖర్చు చేసి, ఆ తర్వాత బిల్లులు చేసుకోవాలని పీడీ టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పడంతో మండల స్థాయిలో ఏపీఎంలు ఖర్చు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను మండల, జిల్లా సమాఖ్య నుంచి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఈ శాఖకు సంబంధించి ఆర్థిక విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఈ బిల్లుల్లో తేడా ఉందని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి నగదు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. గన్నవరం, పెనమలూరు మండలాల్లో పెద్దమొత్తంలో బిల్లులు పెట్టడం, ఈ లెక్కల ప్రకారం నగదు ఇస్తే భవిష్యతలో ఆడిట్‌ అభ్యంతరాలు ఎదురవుతాయని వారు చెప్పినట్లు తెలిసింది. జిల్లాలోని 25 మండలాల్లో రూ.70 లక్షల వరకు బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఏపీఎంలు తమకు బిల్లులు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఇచ్చేందుకు ఏపీఎంలు తయారు చేసిన లెక్కలకు సంబంధించిన పత్రాలను డీఆర్‌డీఏ పీడీ తీసుకుని, ఈ విషయంపై తాను కలెక్టర్‌తో మాట్లాడుతానని వారిని తిప్పి పంపేశారు. ఇప్పటికే ఈ బిల్లుల చెల్లింపు అంశంలో డీఆర్‌డీఏ పీడీ సక్రమంగా వ్యవహరించకపోవడంతో కలెక్టర్‌ సీరియస్‌ అయినట్లు డీఆర్‌డీఏ విభాగం అధికారులు చెప్పుకుంటున్నారు.

ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు నీళ్లు

జిల్లాలోని మచిలీపట్నం కోడూరు, నాగాయలంక, ఘంటసాల మండలాల ఏపీఎం పోస్టులను భర్తీ చేయలేదు. తమ మనుషులను ఈ మండలాల్లో ఇన్‌చార్జిలుగా నియమించి నెట్టుకొస్తున్నారు. మచిలీపట్నం మండలంలో పనిచేసే సీసీని ఇటీవల పెడనకు బదిలీ చేశారు. ఆమె అక్కడ చేరకుండా మచిలీపట్నం మండల ఏపీఎం హోదాలో అన్ని ఫైళ్లపై సంతకాలు చేయడం గమనార్హం. దీంతో పాటు ఇటీవల జరిగిన బదిలీల్లో జిల్లా సమాఖ్య పరిధిలో పనిచేసే కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌లు ఏడుగురిని జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టి మూడు నెలలుగా జీతాలు ఇస్తున్నారని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.

ఒకసీసీ బదిలీ కోసం అనేక సార్లు ఉత్తర్వులు

అవనిగడ్డ నియోజకవర్గంలో పనిచేసే కమ్యూనిటీ కోఆర్డినేటర్‌(సీసీ)కు పోస్టింగ్‌ ఇచ్చేందుకు గత నాలుగైదు నెలల్లో ఏడెనిమిది సార్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ సీసీని మోపిదేవి, చల్లపల్లి, కోడూరు తదితర మండలాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, ఆ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు మా మండలంలో ఈ సీసీ పనిచేయడానికి వీల్లేదని పట్టుబట్టడం, మళ్లీ వేరే మండలానికి ఈ సీసీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతూ వస్తోంది.

జిల్లా సమైక్య అధ్యక్షురాలి పదవీ కాలం ముగిసినా..

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలిని నియమించారు. 2024 ఏప్రిల్‌లో ఆమె పదవీకాలం ముగిసింది. అయినా ఆమెనే ఈ పదవిలో కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇన్‌చార్జి పీడీలు ముగ్గురు మారారు. మార్చి నుంచి రెగ్యులర్‌ పీడీ వచ్చినా జిల్లా సమైక్య అధ్యక్షురాలిని మార్చకుండా జాప్యం చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

విధులు పక్కన పెట్టి డీఆర్‌డీఏ పీడీ సీసీని అంటూ హడావిడి!

గతంలో అవనిగడ్డ డీపీఎంగా పనిచేసిన అధికారి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సస్పెండ్‌ అయ్యే వరకు వ్యవహారం వెళ్లింది. గతంలో పనిచేసిన ఇన్‌చార్జి పీడీ ఒకరు మానవతా దృక్పథంతో ఈ అధికారిని సస్పెండ్‌ చేయకుండా, చార్జి మెమో జారీ చేసి సరిపెట్టారు. అవనిగడ్డనుంచి జిల్లా కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విబాగం డీపీఎంగా వచ్చిన ఈ అధికారి తాను చేయాల్సిన పనులను పక్కనపెట్టి, డీఆర్‌డీఏ పీడీ సీసీని అంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నాడని జిల్లా కార్యాలయ అధికారులు, సిబ్బంది విమర్శిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్‌, మెడికల్‌ బిల్లులు, మరణించిన ఉద్యోగులకు సంబంధించిన సెటిల్‌మెంట్‌లు కూడా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయని మండిపడుతున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:10 AM