కిలాడీ దంపతులు!
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:59 AM
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారికి మొక్కలు అంటే ఎంతో ఇష్టం.. వాటిని పెంచిన వారికి కొలువులు ఇస్తామని ప్రచారం చేశారు.. పర్యావరణ పరిరక్షకులుగా ప్రజలతో పరిచయాలు పెంచుకున్నారు.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సంస్థ పేరుతో వారి జీవితాల్లోకి ప్రవేశించారు. రూ.లక్షకు నెలకు రూ.9 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు. తెలుగు రాషా్ట్రల్లో అనేక మంది నుంచి రూ.15 కోట్ల వరకు పెట్టుబడులు సేకరించారు. కొన్నాళ్లు బాగానే చెల్లింపులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విస్సన్నపేటలో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది.
- మొక్క పెంచిన వారికి కొలువు అంటూ ప్రచారం
- పర్యావరణ పరిరక్షకులుగా పరిచయాలు
- లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థ పేరుతో పెట్టుబడుల సేకరణ
- రూ.లక్షకు నెలకు రూ.9వేలు వడ్డీ ఆశ చూపడంతో..
- రూ.15 కోట్ల వరకు వచ్చిన పెట్టుబడులు
- కొన్నాళ్లు చెల్లించి ఆ తర్వాత బోర్డు తిప్పేసిన దంపతులు
- విస్సన్నపేటలో వెలుగుచూసిన ఘరానా మోసం
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారికి మొక్కలు అంటే ఎంతో ఇష్టం.. వాటిని పెంచిన వారికి కొలువులు ఇస్తామని ప్రచారం చేశారు.. పర్యావరణ పరిరక్షకులుగా ప్రజలతో పరిచయాలు పెంచుకున్నారు.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సంస్థ పేరుతో వారి జీవితాల్లోకి ప్రవేశించారు. రూ.లక్షకు నెలకు రూ.9 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు. తెలుగు రాషా్ట్రల్లో అనేక మంది నుంచి రూ.15 కోట్ల వరకు పెట్టుబడులు సేకరించారు. కొన్నాళ్లు బాగానే చెల్లింపులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విస్సన్నపేటలో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది.
విజయవాడ/ విస్సన్నపేట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
కృష్ణాజిల్లా మచిలీపట్నం బీచ్ రోడ్డు శ్రీనివాసనగర్‌కు చెందిన నండూరి శివనాగ దుర్గాప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వకు చెందిన శివాని దంపతులు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో ఇంద్రకీలాద్రిపై టికెట్ విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సమయంలో కౌంటర్లలో టికెట్లు విక్రయించారు. అక్కడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. తర్వాత వివాహం చేసుకుని విస్సన్నపేటలో స్థిరపడ్డారు.
మొక్కతో ప్రజల ముందుకు
విస్సన్నపేటలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను పెంచాలని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మొక్కలను పెంచిన వారికి ఉద్యోగం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇలా ప్రజలకు చేరువైన తర్వాత అసలు ప్రణాళికను అమలు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి అధిక చెల్లింపులు చేస్తామని హామీలు ఇచ్చారు. రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.9వేలు చెల్లిస్తామని చెప్పారు. ఈ విధంగా 2023 నుంచి రెండు తెలుగు రాషా్ట్రల్లో ఉన్న పలువురు వద్ద పెట్టుబడులు సేకరించారు. మొత్తం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు సేకరించినట్టు సమాచారం. రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.90వేలు చొప్పున రెండేన్నరేళ్లు (30 నెలలు)పాటు చెల్లించారు. అసలు కంటే మూడింతల చెల్లింపులు చేస్తామని ఆశలు చూపించారు. దీంతో రెండు తెలుగు రాషా్ట్రల్లో పలువురు ఎగబడి పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడుల స్వీకరణకు దుర్గాప్రసాద్ మచిలీపట్నం నుంచి శ్రీకారం చుట్టినట్టు సమాచారం. బాధితుల్లో ఎక్కువ మంది మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. విస్సన్నపేటకు చెందిన అండిదేవర రాజేష్ రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టానని అందులో రూ.50 వేలు తిరిగి చెల్లించారని, ఇంకా రూ.4.50 లక్షలు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సంస్థకు దుర్గాప్రసాద్ సీఈవోగా వ్యవహరించాడు. డైరెక్టర్‌గా శివాని ఉన్నారు. ఇప్పుడు శివాని పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందమైన జీవితం అంధకారంలోకి వెళ్లిందని తెలియడంతో పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా పోలీసుల వద్దకు క్యూ కడుతున్నారు.
శివాని అదృశ్యంపై ఫిర్యాదు
దుర్గాప్రసాద్, శివాని మూడో వ్యక్తిని రానివ్వకుండా ఇద్దరు కలిసే పెట్టుబడులు సేకరించారు. రెండేళ్ల పాటు పెట్టుబడుల స్వీకరణ, చెల్లింపులు బాగానే సాగాయి. తర్వాత ‘అందమైన జీవితంలో’ ఒడిదుడుకులు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వారికి చేయాల్సిన చెల్లింపులు క్రమంగా నెమ్మదించాయి. కొద్దినెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో దుర్గాప్రసాద్ కొద్దిరోజుల క్రితం విస్సన్నపేట నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి శివాని సంస్థ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. కొద్దిరోజులుగా ఆమె కార్యాలయం తలుపులు తెరవకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శివాని ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించడం లేదని ఆమె తండ్రి గోవిందు రెడ్డిగూడెం పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.