అరణ్యరోదనే!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:42 AM
ఆరుగాలం వ్యయప్రయాసాల కోర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి రైతులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. కోత కోసి వారం నుంచి 15 రోజుల పాటు ఆరబెట్టిన ధాన్యాన్ని కాటావేద్దామంటే గోనె సంచుల దొరకవు. సంచులు లభించి కాటా వేసిన ధాన్యాన్ని మిల్లు తరలించాలంటే రోజుల తరబడి వాహనాలు రావు. అన్నీ సమకూరి మిల్లుకు తరలిస్తే రెండో సారి అక్కడ తేమ శాతం పరిశీలన చేసి రైతును దోచుకుంటున్నారు. దీనికి తోడు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీనిపై అయ్యంకి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల హామీతో విరమించారు. ప్రభుత్వం డబ్బులు తక్షణమే రైతు ఖాతాల్లోకి వేస్తుందన్న సంతోషం తప్పా మిగతా సమస్యలన్నీ యథాతధంగానే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అగచాట్లు
-కృష్ణానది ఒడ్డున 300 ఎకరాల ధాన్యం రాశులు
- 17 శాతం వరకు ఎండిన ధాన్యం
- కాటా వేసేందుకు గోనె సంచులు కరువు
-ధాన్యం బస్తాల రవాణాకు వాహనాలు నిల్
- తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయం, అయ్యంకి ఆర్‌ఎస్‌కే వద్ద రైతుల ఆందోళన
ఆరుగాలం వ్యయప్రయాసాల కోర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి రైతులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. కోత కోసి వారం నుంచి 15 రోజుల పాటు ఆరబెట్టిన ధాన్యాన్ని కాటావేద్దామంటే గోనె సంచుల దొరకవు. సంచులు లభించి కాటా వేసిన ధాన్యాన్ని మిల్లు తరలించాలంటే రోజుల తరబడి వాహనాలు రావు. అన్నీ సమకూరి మిల్లుకు తరలిస్తే రెండో సారి అక్కడ తేమ శాతం పరిశీలన చేసి రైతును దోచుకుంటున్నారు. దీనికి తోడు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీనిపై అయ్యంకి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల హామీతో విరమించారు. ప్రభుత్వం డబ్బులు తక్షణమే రైతు ఖాతాల్లోకి వేస్తుందన్న సంతోషం తప్పా మిగతా సమస్యలన్నీ యథాతధంగానే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు/కూచిపూడి:
తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో ధాన్యం రైతులు గోనె సంచుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌ఎస్‌కేకి వచ్చిన గోనె సంచులను కొందరు సిబ్బంది తక్షణ అవసరం లేకపోయినా ముందస్తుగానే తమకు అనుకూలమైన రైతులకు అందించి పది రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకు మొండి చెయ్యి చూపటంతో బాధిత రైతులు రగిలిపోతున్నారు. గురువారం ఉదయం పదిమంది రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బొడ్డపాడు, చినపులిపాక, వల్లూరుపాలెం రైతులు సుమారు 300 ఎకరాలలోని ధాన్యాన్ని వల్లూరుపాలెం కృష్ణానది ఒడ్డున ఖాళీ ప్రదేశంలో కల్లాలుగా ఆరబెట్టారు. 13 రోజుల నుంచి ఎండిన ధాన్యం, 17 శాతం తేమ వచ్చినప్పటికీ గోనె సంచులు లేక కాటా వేయలేక పరదాలు కప్పి ఉంచామని రైతులు చెప్పారు. ఐదు రోజుల క్రితం కాటా వేసిన ధాన్యం బస్తాలు కూడా పరదాల కిందే ఉన్నాయి. సహజంగా కోసిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు ధాన్యం ఎండితే 17 తేమ శాతం వస్తుంది. అలాంటిది 13 రోజులుగా కాటా వేసేందుకు ఎదురు చూడటంతో ధాన్యం మితిమీరి ఎండి నూక వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా తేమ శాతం చూడటం, నూక వస్తోందని, తేమ శాతం ఎక్కువగా ఉందని రకరకాల కారణాలు చెప్పి ధాన్యం తూకంలో కోత విధించటం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని లబోదిబోమంటున్నారు. మేము రైతులకు అండగానే ఉంటున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. రైస్‌మిల్లు వద్ద తేమ శాతం చూడకూడదని, ఆర్‌ఎస్‌కె వద్ద తీసిన తేమ శాతం రిపోర్టుని మిల్లులు అంగీకరించాల్సిందేనని, ఇందుకు మిల్లు వద్ద కస్టోడియల్ అధికారిని నియమించామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చెప్పినప్పటికీ మిల్లర్లలో మార్పు రాలేదని విమర్శలు వస్తున్నాయి.
రైతు సేవా కేంద్రం తీరుపై రైతు సంఘాల ఆగ్రహం
ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యంపై రైతులు, ప్రజాసంఘాల నేతలు గురువారం అయ్యంకి రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన కౌలు రైతు రాజులపాటి మోహన కృష్ణ ధాన్యం నూర్చి 16 రోజుల నుంచి రోడ్లపై ధాన్యాన్ని ఆరబె డుతుండగా, తేమశాతం 16 ఉన్నప్పటికీ నేటి వరకు ఆర్‌ఎస్‌కే సిబ్బంది ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. మరికొందరు రైతుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉండటంతో ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలిచాయి.
రంగంలోకి దిగిన అధికారులు
దీనిపై స్పందించిన సివిల్ సప్లయ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు అయ్యంకి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడిన ప్రతిష్టంభనపై అక్కడి సిబ్బందితో చర్చించి అనంతరం కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం పరిశీలించారు. తేమశాతం యంత్రం సహాయంతో పరీక్షించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించి వారి సలహా మేరకు ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపడతామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శివరామప్రసాద్ తెలిపారు. సాంకేతిక శాఖ అధికారిణి డయానా, మొవ్వ సబ్ డివిజన్ ఏడిఏ ఎస్.శ్యామల, ఏవో సురేష్‌బాబు నాయక్, ఆర్‌ఐ విజయదుర్గ, వీఆర్వో కాసిం, వీఏఏ కోటి నాగులు పాల్గొన్నారు.
రైతులు ఆత్మహత్య చేసుకుంటానన్న స్పందించరా? : ప్రజా సంఘాల నేతలు
ధాన్యం కొనుగోళ్లలో రైతులు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు స్పందించరా? అని ప్రజాసంఘాల నేతలు అధికారులను ప్రశ్నించారు. కౌలు రైతు రాజులపాటి మోహన కృష్ణ 16 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకుంటున్నా నేటి వరకు అతనికి రైతు సేవా కేంద్ర నిర్వాహకులు ఒక్క సంచిగానీ, ధాన్యాన్ని ఆరబెట్టుకోవటానికి కనీసం టార్పాలిన్ పట్టా కూడా ఇవ్వకపోవటం ఆవేదన కలిగిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కౌలు రైతు మోహన కృష్ణ ఆత్మహత్య కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారని వివరించారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోసూరు శివనాగేంద్రం, పంచకర్ల రంగారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.వి.లక్ష్మణస్వామి, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
గత నెల 28 నుంచి కాటా వేయలేకపోయా
వల్లూరుపాలెంలో నవంబరు 28వ తేదీన 7 ఎకరాల్లో యంత్రంతో కోతకోసి ధాన్యాన్ని నది ఒడ్డున ఆరబెట్టా. డిసెంబరు 5వ తేదీన ఆర్‌ఎస్‌కే సిబ్బంది తేమ శాతం చూసి 17 ఉందని చెప్పారు. కాటా వేసేందుకు గోనె సంచులు కావాలంటే ఇంత వరకు అందించలేదు. నాకంటే వెనుక కోత కోసిన వారికి గోనె సంచులు ఇచ్చారు. వారు ఇళ్ల వద్ద నిల్వ చేసుకున్నారు. దాంతో మాలాంటి రైతులం ఇబ్బందికి గురవుతున్నాం. అలాగే మిల్లుకు వెళ్లిన తర్వాత ధాన్యాన్ని శాంపిల్ తీసి తేమ శాతం పరీక్షించి తక్కువ తూకం రాస్తున్నారు. ఇది చాలామంది రైతులకు జరిగింది.
- బడుగు సత్యనారాయణ, రైతు, వల్లూరుపాలెం
ఎన్ని రోజుల పాటు ధాన్యంతో ఇబ్బంది పడాలి
కృష్ణానది ఒడ్డున ఐదు ఎకరాల ధాన్యం ఆరబెట్టా. పది రోజుల క్రితం తేమ శాతం పరీక్షించారు. 17 శాతం వచ్చింది. పది రోజులుగా గోనె సంచులు అందించలేకపోయారు. దాంతో పరదాల కింద జాగ్రత్త చేస్తున్నా. పొలంలో మూడు ఎకరాల ధాన్యానికి గోనె సంచులు లభించగా, నాలుగు రోజుల క్రితం కాటా వేశాం. ఆ ధాన్యం బస్తాలను మిల్లుకు పంపేందుకు వాహనం రాలేదు. ఇలా ఎన్ని రోజులు ధాన్యంతో బాధలు పడాలి. సకాలంలో ధాన్యం మిల్లుకు వెళ్లకపోతే బస్తాల్లో గింజలకు ఆవిరి వచ్చి తేమ శాతం పెరగవచ్చు. అలాగే నూక రావచ్చు. అధికారులు చేసే జాప్యానికి మేము నష్టపోవాలా.
- వేమూరి జార్జి నిరంజనరావు, రైతు, వల్లూరుపాలెం
గోనె సంచులు సమకూరుస్తున్నాం
ఒక్కో ఆర్‌ఎస్‌కేకి మూడు వేల గోనె సంచులు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొన్ని రైస్ మిల్లులు ధాన్యాన్ని ఆడకుండా నిల్వ చేస్తుండటంతో తిరిగి సంచులు రాకపోవటం కొరతకు కారణంగా ఉంది. దగ్గర్లోని మిల్లులకే ధాన్యాన్ని పంపాలని రైతులు పట్టుబడుతున్నారు. నూక అయితే తూకం తగ్గించొద్దంటున్నారు. మండలంలో 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా గురువారం వరకు 5,632 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి మిల్లులకు పంపించాం. డబ్బులు తక్షణమే జమవుతున్నాయి.
- ఎం.కుసుమకుమారి, తహసీల్దార్