అవినీతి జలగల దొంగాట!
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:15 AM
ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలోని కొందరు అవినీతి అధికారులు దొంగాట మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంలో సరిచేసుకునేందుకు కొత్త ప్లాన్ వేశారు. రీ ఎంక్వయిరీ వేయించుకొని క్లీన్ చిట్ పొందేందుకు ఈఎన్‌సీ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారితో బిగ్ డీల్ కూదుర్చుకున్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై విమర్శలు
- గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమాలు
- కూటమి ప్రభుత్వంలో తప్పులను సరిచేసుకునే ప్లాన్!
- రీ ఎంక్వయిరీ వేయించుకొని.. క్లీన్ చిట్ పొందేందుకు యత్నం
- ఈఎన్‌సీ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారితో బిగ్ డీల్!
- అందుకు అనుగుణంగా కదులుతున్న పావులు
ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలోని కొందరు అవినీతి అధికారులు దొంగాట మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంలో సరిచేసుకునేందుకు కొత్త ప్లాన్ వేశారు. రీ ఎంక్వయిరీ వేయించుకొని క్లీన్ చిట్ పొందేందుకు ఈఎన్‌సీ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారితో బిగ్ డీల్ కూదుర్చుకున్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
నాడు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంలో కడిగేసుకునేందుకు గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగంలోని కొందరు అవినీతి అధికారులు ఈఎన్‌సీ కార్యాలయంలో తిష్టవేసి పైరవీలు ప్రారంభించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఈ అవినీతి భాగోతాలు పత్రికలకెక్కినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. లోకాయుక్తకు ఫిర్యాదులు అంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ, అప్పట్లో పంచాయితీరాజ్ అధికారులు చర్యలు చేపట్టలేదు. లోకాయుక్త ఆదేశాలతో విచారణ జరపగా.. అధికారుల అవినీతి బాగోతాలు ఆధారాలతో సహా బయట పడ్డాయి. ఒక డీఈఈ, పలువురు ఏఈలపై అప్పట్లో ఆరోపణలు నిగ్గుతేలాయి. దీంతో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. ఇక తమ పని అయిపోయిందని అవినీతి అధికారులంతా భయపడ్డారు. తమకు కలసి వచ్చే సమయం కోసం ఎదురుచూశారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఒక ఉన్నతాధికారితో డీల్ పెట్టుకున్నారని తెలిసింది. బేరసారాలు అన్నీ కుదుర్చుకున్నారని సమాచారం. దొడ్డిదారిన రీ ఎంక్వయిరీ చేయించి తప్పులు నిర్ధారణ కాలేదన్నట్టుగా ఉన్నతస్థాయిలో నివేదిక పంపి అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. ఈ డీల్ కోసం భారీ ఎత్తున నగదు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి చాపకింద నీరులా అన్నీ జరిగిపోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదిక పంపి అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న దశలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.
అప్పట్లో జరిగిన అక్రమాల్లో కొన్ని..
విజయవాడ రూరల్ మండలం రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో రక్షిత మంచినీటి పనులకు సంబంధించి అవినీతి జరిగింది. జీఐ పైపులు సిమెంట్ రోడ్డు మీద వేయగా.. భూమి తవ్వి లోపల వేసినట్టుగా రికార్డు జరిగింది. ఏఈ అడ్డగోలుగా రికార్డు చేయగా.. ఇన్‌చార్జి డీఈఈ చెక్‌మెజర్‌మెంట్ చేశారు. ఇన్‌చార్జి ఈఈ పేమెంట్‌కు క్లియర్ చేశారు. చందర్లపాడు మండలంలో రక్షిత మంచినీటి పైపులైన్లకు సంబంధించి 63 ఎంఎం డయా పైపులు వేశారు. కానీ 75 ఎంఎం డయా పైపులు వేసినట్టుగా రికార్డు చేశారు. పైపులు వేసిన నిర్ణీత దూరం కంటే కూడా ఎక్కువుగా వేసినట్టు రికార్డు చేశారు. కంచికచర్లలో హెచ్‌డీపీఈ పైపులు కాకుండా డూప్లికేట్ పైపులు వేయటంతో.. అవి ప్రెజర్ టెస్ట్‌లో పగిలిపోయాయి. ఇలా చెప్పటానికి అనేక అక్రమాలు ఉన్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి అప్పటి ఇన్‌చార్జి ఈఈ రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు అందిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా, అక్రమాలు నిజమని తేలింది. వీటిపై అప్పటి ఈఎన్‌సీ కార్యాలయంలోని చీఫ్ ఇంజనీర్ సంజీవ్ రెడ్డి పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారిపై చార్జ్‌ఫ్రేమ్స్ ఇవ్వటం జరిగింది.