‘దివిసీమ ఉప్పెన’తో నాలో మార్పు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:50 AM
దివిసీమ ఉప్పెన పునర్నిర్మాణ కార్యక్రమాలు తన జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఓ రకంగా దివిసీమ తన కర్మ భూమి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో 1977 దివిసీమ ఉప్పెన 48 సంవత్సరాల సంస్మరణ సభ, మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు.
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- అవనిగడ్డలో దివిసీమ ఉప్పెన సంస్మరణ సభ
అవనిగడ్డ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దివిసీమ ఉప్పెన పునర్నిర్మాణ కార్యక్రమాలు తన జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఓ రకంగా దివిసీమ తన కర్మ భూమి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో 1977 దివిసీమ ఉప్పెన 48 సంవత్సరాల సంస్మరణ సభ, మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దత్తాత్రేయ మంత్రి రవీంద్రతో కలిసి మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉప్పెన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. బండారు దత్తాత్రేయ ఉప్పెన సమయంలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మరుభూమిగా మారిన దివిసీమ గ్రామాలైన పర్రచివర, దిండి, సొర్లగొంది, మూలపాలెం, కోడూరు గ్రామాల్లో తాము చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని తెలిపారు. సామూహిక శవ దహన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. నాడు మంత్రిగా ఉన్నప్పటికీ మూల్లపాడు నడిచి తమకు మండలి వెంకట కృష్ణారావు ప్రేరణ కలిగించారని తెలిపారు. దేశ విదేశాల నుంచి 132 స్వచ్చంద సంస్థలు దివి ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చాయని, నాటి సేవా సంస్థల కమిటీకి తాను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించానని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దివిసీమ పునర్నిర్మాణం, అభివృద్ధికి స్వచ్చంద సంస్థలను కలుపుకుని మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ పునర్నిర్మాణంలో భాగస్వాములైన మానవతామూర్తులను ఆహ్వానించి, వారందరిని సత్కరించుకోవటం గొప్ప అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి, రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శితికానంద మహరాజ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ నేత ఎన్.తలసీరెడ్డి, సీపీఎం జాతీయ నాయకులు మధు, రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసరావు, దివిసీమ సోషల్ సొసైటీ నిర్వాహకులు ఫాదర్ అమల్ రాజ్, డాక్టర్ జి.సమరం, డాక్టర్ టి.నాగేంద్రస్వామి, సిహెచ్.సత్యనారాయణ, రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వై.వి.రామారావు, లయన్స్ డిసి్ట్రక్ట్ గవర్నర్ వివి.పి.ఎస్.ఆంజనేయులు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.