Share News

దర్జాగా కబ్జా!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:38 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వ భూముల కబ్జా పర్వం ఇంకా కొనసాగుతోంది. బైపాస్‌ పక్కనే ఉన్న మున్సిపల్‌ రోడ్డు స్థలం సుమారు రెండు సెంట్లను కొందరు కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించేశారు. అందులో ఏకంగా షాపులు నిర్మించి అద్దెలకు ఇచ్చి నెలనెల ఆదాయం పొందుతున్నారు. స్థలం ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేసినా మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వైపు ఆక్రమణలు తొలగించి.. మరో వైపు ప్రోత్సహిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దర్జాగా కబ్జా!

- బైపాస్‌ వెంబడి మున్సిపల్‌ రోడ్డు స్థలం 2 సెంట్లు ఆక్రమణ

- రూ.50 లక్షల విలువైన స్థలంలో అక్రమంగా షాపుల నిర్మాణం

- అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతున్న కొందరు కూటమి నాయకులు

- నిర్మాణ సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆరోపణ

- ఒక వైపు ఆక్రమణలు తొలగించి.. మరోవైపు ప్రోత్సహించడంపై మండిపాటు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వ భూముల కబ్జా పర్వం ఇంకా కొనసాగుతోంది. బైపాస్‌ పక్కనే ఉన్న మున్సిపల్‌ రోడ్డు స్థలం సుమారు రెండు సెంట్లను కొందరు కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించేశారు. అందులో ఏకంగా షాపులు నిర్మించి అద్దెలకు ఇచ్చి నెలనెల ఆదాయం పొందుతున్నారు. స్థలం ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేసినా మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వైపు ఆక్రమణలు తొలగించి.. మరో వైపు ప్రోత్సహిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలోని లక్ష్మీటాకీస్‌ సెంటరు నుంచి మూడు స్తంభాల సెంటరు వరకు బైపాస్‌ రోడ్డు ఉంది. ఈ రహదారి వెంబడి పురాతనమైన సెయింట్‌ మేరీస్‌ చర్చి ప్రధాన గేటు ఎదురుగా ఖాళీగా ఉన్న సుమారు రెండు సెంట్ల స్థలంపై ఇటీవల కొందరు కూటమి నాయకుల కన్నపడింది. అనుకున్నదే తడవుగా బైపాస్‌ రహదారి వెంబడి ఉన్న మునిసిపల్‌ రోడ్డు స్థలాన్ని తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించేశారు. ఆ స్థలంలో వేగంగా షాపులను నిర్మించి అద్దెకు కూడా ఇచ్చేశారు. వీరికి మునిసిపల్‌ అధికారుల అండుదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వ్యాపార కూడలి కావడంతో..

ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడే ఐమ్యాక్స్‌, డీమార్ట్‌ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం వ్యాపార కూడలిగా మారింది. సెయింట్‌ మేరీస్‌ చర్చి ప్రధాన గేటు ఎదురుగా ఉన్న ఈ స్థలం వంద సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉంటున్నా.. ఎవ్వరూ ఈ స్థలం ఆక్రమించే సాహసం చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణకు గురైన స్థలం మునిసిపల్‌ రికార్డుల ప్రకారం 100 అడుగులకుపైగా వెడల్పుతో రహదారికి కేటాయించినట్టుగా ఉందని అంటున్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించేసి నాలుగైదు షాపులు ఇటీవల కాలంలోనే నిర్మాణం చేశారని చెబుతున్నారు. సుమారు రూ.50 లక్షలు విలువైన రహదారి స్థలం ఆక్రమించుకుని షాపులు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు తొలగింపు.. మరో వైపు ఆక్రమణలు

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో రహదారుల వెంబడి ఉన్న డ్రెయిన్‌లపై చిన్నపాటి బడ్డీలను ఏర్పాటు చేసుకుని చిరువ్యాపారాలు జీవనం సాగించేవారు. అయితే పూర్తిస్థాయిలో డ్రె యిన్‌లకు లింకులు కలిపి, మురుగు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను మునిసిపల్‌ అధికారులు రెండు నెలల పాటు తొలగించారు. అభివృద్ధి పనులు చేస్తే వర్షం కురిసిన సమయంలో రహదారులపై నీరు నిల్వ కుండా ఉంటుందని అందరూ ఈ ఆక్రమణల తొలగింపునకు సహకరించారు. నగరంలో రూ.13 కోట్లతో డ్రెయిన్‌ పనులకు అంచనాలు తయారు చేశారు. ఈ నిధులు విడుదల కాకముందే హడావిడిగా ఆక్రమణలను తొలగించడం కొంతమేర విమర్శలకు దారితీసింది. ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ బాలాజీ మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో డ్రెయిన్‌లకు సంబంధించిన లింకులు కలిపితే, డ్రెయిన్‌లలో నీరు సక్రమంగా బయటకు పోతుందని, ఇందుకు రూ.13కోట్లను మంజూరు చేయాలని కోరారు. అయినా ఇంత వరకు ఈ నిఽధుల మంజూరు జరగనేలేదు. ఆక్రమణలు తొలగించి అక్కడే వదిలేయడంతో అవి వర్షాలు పడినప్పుడు డ్రెయిన్లలోకి జారీ సమస్య మరింత తీవ్రం అవుతోంది. కాగా, నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించిన కొద్ది రోజులకే బైపాస్‌ రహదారి వెంబడి స్థలాన్ని కూటమి నాయకులు ఆక్రమించి షాపులు కట్టినా మునిసిపల్‌ అధికారులు ఎందుకు అడ్డుకోలేదని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:39 AM