పర్యాటకులకు పెద్దపీట!
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:43 AM
విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాలెన్స్ పనులను పూర్తి చేయటంతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

- అంబేడ్కర్ స్మృతి వనాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
- పర్యవేక్షణ బాధ్యతలు సాంఘీగ సంక్షేమ శాఖ నుంచి ఏపీ కల్చరల్ విభాగానికి బదిలీ!
- సాంస్కృతిక శాఖ నిధులతో అభివృద్ధికి శ్రీకారం
- రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులు
- ప్రధానంగా కన్వెన్షన్ సెంటర్, స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు
- పచ్చజెండా ఊపిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాలెన్స్ పనులను పూర్తి చేయటంతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబేడ్కర్ స్మృతివనం అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న అంశాలను అధికారుల నుంచి తెలుసుకున్నాక.. పర్యాటక కార్యకలాపాలు పెంపొందింపచేయటానికి వీలుగా ప్రస్తుతం పర్యవేక్షణ జరుపుతున్న సాంఘీక సంక్షేమ శాఖను తొలగించారు. ఆ స్థానంలో ఏపీ కల్చరల్ విభాగానికి స్మృతి వనం బాధ్యతలను అప్పగించారు. అంబేద్కర్ స్మృతివనంలో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. అంబేడ్కర్ స్మృతివనంలో సందర్శకులను ఆకర్షించేలా కార్యక్రమాలను నిర్వహిస్తేనే పర్యాటకులు వస్తారని ప్రభుత్వం భావించింది. కిందటి ప్రభుత్వంలో తలపెట్టిన అంబేడ్కర్ స్మృతివనం పనులకు సంబంధించి రూ.150 కోట్ల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటిలో అతి ముఖ్యమైనది కన్వెన్షన్ సెంటర్. ఆ తర్వాత హస్తకళల స్టాల్స్, ఫన్ జోన్స్ తదితరాలు ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తయినా.. బ్యాలెన్స్ పనులు, ఫినిషింగ్ పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది కెపాసిటీతో అప్పట్లో శ్రీకారం చుట్టడం జరిగింది. కన్వెన్షన్ సెంటర్, ఇతర పనులు పూర్తి కాకుండానే కిందటి ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దటానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కూడా నిర్దేశించటం జరిగింది. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సందర్శకుల సంఖ్య పెంచేందుకు..
దీంతో అంబేడ్కర్ స్మృతివనాన్ని మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దనున్నారు. స్మృతి వనం బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టనున్నారు. స్మృతివనాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. స్మృతి వనంలో ఉన్న అంబేడ్కర్ మ్యూజియం, మినీ థియేటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి వస్తే సభలు, సమావేశాలు, ఫంక్షన్లు, అనేక ఈవెంట్లు ఇక్కడ నిర్వహించుకోవచ్చు. కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఇండోర్ ఎగ్జిబిషన్లు వంటివి కూడా నిర్వహించుకోవటానికి అవకాశం ఉంటుంది. స్మృతివనంలో హస్త కళాఖండాల స్టాల్స్‌ను కూడా పూర్తి చేసిన తర్వాత.. రాష్ట్రంలోనే పేరెన్నిక గల కళాఖండాలన్నింటినీ ఇక్కడ విక్రయించేలా అవకాశం కల్పిస్తారు. తద్వారా స్టాల్స్ సందర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఫుడ్‌కోర్టులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫుడ్ కోర్టుల ఏర్పాటు ద్వారా సాయంత్రం సమయంలో చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ స్మృతి వనాన్ని సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించటం జరిగింది.
అమరావతి నిర్మాణరంగ ప్రాజెక్టులకు కేబినెట్‌లో ఆమోదం :
అమరావతి రాజఽధానిలో ప్రతిష్ఠాత్మకంగా తలపెడుతున్న పలు నిర్మాణ రంగ ప్రాజెక్టులకు ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఇంతకు ముందే పలు సీఆర్‌డీఏ అఽథారిటీ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయటం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ కోసం కూడా సీఆర్‌డీఏ ప్రతిపాదించటం జరిగింది. అథారిటీ సమావేశంలో వీటిపై చర్చించి అనుమతించినందున.. క్యాబినెట్ సమావేశంలో మరో ఆలోచన లేకుండా ఆమోద ముద్ర వేయటం జరిగింది. రాజధానిలో ఐకానిక్ నిర్మాణాలైన జీఏడీ టవర్స్, హెచ్‌వోడీ టవర్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలైన షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ లు దక్కించుకున్న సంగతి తె లిసిందే. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో వాటికి అప్పగించటం జరిగింది. దానినే క్యాబినెట్‌లో ఆమోదించారు. రాజధానిలో రాజమార్గాలుగా పేర్కొనే ఈ - 3 రోడ్డును ఎన్‌హెచ్ - 16కు అనుసంధానించేందుకు రూ. 682 కోట్ల విలువైన పరిపాలనా అనుమతినిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధిలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు ప్రమోషన్ చానల్ కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కొత్తగా 40 ప్లానింగ్ అసిస్టెంట్ల అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదించటం జరిగింది.