Markapur Forest Department: నల్లమలలో 87 పెద్దపులులు
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:38 AM
నల్లమల అడవిలో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నాయని ప్రాజెక్టు టైగర్-మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ చెప్పారు.
ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించాం
ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ వెల్లడి
మార్కాపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): నల్లమల అడవిలో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నాయని ప్రాజెక్టు టైగర్-మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. ఇక్కడ ఉన్న పులులను నాలుగేళ్లకోసారి లెక్కిస్తున్నామని తెలిపారు. 2022లో జాతీయ పులుల గణన సమయంలో 74 ఉన్నాయని, వాటి సంఖ్య ప్రస్తుతం 87కు చేరిందని చెప్పారు. మళ్లీ 2026లో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల గణన చేపట్టనున్నట్టు తెలిపారు. త్వరలో ఎన్‌ఎస్‌టీఆర్(నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్) పరిధి విస్తరించనుందన్నారు. నల్లమలలో ఉన్న పులులు ఇప్పటికే కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలు దాటి శేషాచలం అడవుల వరకు సంచరిస్తున్నాయని చెప్పారు. పులులను ట్రాప్ చేసేందుకు అడవిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నల్లమలలో ఎకో టూరిజానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, వన్యప్రాణుల సంరక్షణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తుమ్మలబైలు, బైర్లూటి, పచ్చర్ల, రోళ్లపాడు ప్రాంతాల్లో రాత్రిపూట సందర్శనకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన్యప్రాణుల జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.