Indian Knowledge Convention: ముగిసిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:07 AM
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహించిన ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం సోమవారం ముగిసింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహించిన ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం సోమవారం ముగిసింది. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రతినిధులు పోస్టర్, ఓరల్, పేపర్, పీపీటీ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇందులో ఉత్తమమైన వాటికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధులకు జ్ఞాపికతో నిర్వాహకులు సత్కరించారు. నాలుగు రోజుల పాటు నాలుగు సమాంతర వేదికలపై 1500 మంది ప్రతినిధులు ప్రసంగాలు, పరిశోధన పత్రాల సమర్పణ చేశారు. 80 ప్రముఖ పరిశోధన, విజ్ఞాన సంస్థలు నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన అందరికీ ఎంతో విజ్ఞానాన్ని పంచింది. దేశంలోని 60 మంది ప్రముఖ యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్స్ నుంచీ వీసీలు, ఇతర అధికారులు ప్రతినిధులుగా పాల్గొన్నారు. మన దేశంలోని అన్ని రంగాల్లో భారతీయ జ్ఞాన పరంపరను కొనసాగించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఈ సమ్మేళనంలో అర్థవంతమైన చర్చ సాగింది. చివరి రోజున ‘శాస్త్ర సాంకేతిక విద్యలోనూ భారతీయ జ్ఞానపరంపర’పై ప్రత్యేక చర్చాగోష్ఠి నిర్వహించారు. భారతీయ జ్ఞానపరంపర భూమికతో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సమన్వయంతో సరికొత్త ఆవిష్కరణలు జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సంస్కృతంలో ఉన్న శాస్త్ర జ్ఞానాన్ని ఆధునిక టెక్నాలజీని సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని నిపుణులు సూచించారు. చివరి రోజున సైన్స్ ఎక్స్‌పో వీక్షణకు విద్యార్థులు తరలివచ్చారు.