Share News

Health Department: 784 మంది పీజీ వైద్యులకు పోస్టింగ్‌

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:26 AM

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద పీజీ వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరి ఏడాది పాటు సర్వీస్‌ చేయాలన్న నిబంధనల మేరకు..

Health Department: 784 మంది పీజీ వైద్యులకు పోస్టింగ్‌

  • ‘ఏడాది సర్వీస్‌’ రూల్‌ కింద ఎస్‌ఆర్‌గా సేవలు

  • 1 నుంచి సెకండరీ, బోధనాసుపత్రుల్లో విధుల్లోకి..

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద పీజీ వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరి ఏడాది పాటు సర్వీస్‌ చేయాలన్న నిబంధనల మేరకు.. 784 మంది పీజీ వైద్యులకు సీనియర్‌ రెసిడెంట్లు (ఎస్‌ఆర్‌)గా ఆరోగ్య శాఖ పోస్టింగ్‌ ఇవ్వనుంది. వీరు సెకండరీ, బోధనాసుపత్రుల్లో జనవరి 1 నుంచి విధులు నిర్వహించనన్నారు. స్పెషాలిటీల వారీగా వీరి సేవలను సదరు ఆస్పత్రుల్లో అవసరాలకు తగ్గట్లు పొందేందుకు వీలుగా అధికారులు జాబితాలు రూపొందించారు. ఇప్పటికే ప్రారంభమైన ఆప్షన్ల నమోదు ప్రక్రియ 29 వరకు కొనసాగుతుంది. ఆప్షన్లు పెట్టుకున్న వారికి వెంటనే పోస్టింగులు ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ పొందిన వారు జనవరి 5లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. 784 మంది సీనియర్‌ రెసిడెంట్లు (ఎస్‌ఆర్‌) రావడంతో ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కాబోతున్నాయని ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆస్పత్రుల్లో 393 మంది, మిగిలిన వారిని 17 బోధనాసుపత్రుల్లో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

ఎస్‌ఆర్‌ షిప్‌గా పరిగణించాలి..

నిబంధనల ప్రకారం ఏడాదిపాటు తప్పనిసరి సర్వీస్‌కు పీజీ పూర్తిచేసిన విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కీలక డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. తాము ప్రభుత్వాస్పత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందాలంటే.. నిబంధనల మేరకు కచ్చితంగా ఒక ఏడాది ఎస్‌ఆర్‌ షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఈ నేపథ్యంలో తప్పనిసరి ఏడాది ప్రభుత్వ సర్వీస్‌ను ఎస్‌ఆర్‌ షిప్‌గా పరిగణించాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 04:27 AM