Share News

AP Sanctuary: జాడలేని పక్షి రక్షణ పేరిటరూ.7 కోట్లు భక్షణ!

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:37 AM

అరుదైన, అంతరించిపోతున్న పక్షి జాతిని కాపాడేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టొచ్చు కానీ... అసలు అక్కడ ఆ పక్షి ఉనికి లేనే లేదని నిర్ధారణ అయిన తర్వాత కూడా...

AP Sanctuary: జాడలేని పక్షి రక్షణ పేరిటరూ.7 కోట్లు భక్షణ!

  • విద్యుత్‌ శాఖలో ‘అరుదైన’ అవినీతి

  • అంతరిస్తున్న అరుదైన పక్షి బట్టమేక

  • రోళ్లపాడులో మూడున్నరేళ్ల క్రితం దాని జాడ

  • ప్రస్తుతం అవి లేవని డబ్ల్యూఐఐ నిర్ధారణ

  • అయినా.. వాటి రక్షణ పేరుతో ‘టెండర్‌’

  • హెచ్‌టీ తీగలకు డైవర్టర్ల ఏర్పాటుకు నిర్ణయం

  • (అమరావతి - ఆంధ్రజ్యోతి)

అరుదైన, అంతరించిపోతున్న పక్షి జాతిని కాపాడేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టొచ్చు! కానీ... అసలు అక్కడ ఆ పక్షి ఉనికి లేనే లేదని నిర్ధారణ అయిన తర్వాత కూడా ‘రక్షణ’ పేరిట కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడితే? అది నిజంగానే ‘అరుదైన’ అవినీతే అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ శాఖ బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ - జీఐబీ) రక్షణ పేరుతో ఇదే చేస్తోంది. వివరాల్లోకి వెళితే... అంతరించిపోతున్న పక్షి జాతి బట్టమేక! రాష్ట్రంలో చివరిగా మూడున్నరేళ్ల క్రితం ఈ అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి సుమారు మూడు అడుగుల ఎత్తు.. 18 కేజీల బరువు ఉంటుంది. ఈ పక్షి రెక్కలు విప్పితే ఏడు అడుగులు ఉంటాయి. నంద్యాల జిల్లాలోని రోళ్లపాడు వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీలో చివరిసారిగా ఈ పక్షి 2022 మార్చి 15న కనిపించిందని అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత దీని జాడే లేదు. ‘రోళ్లపాడులో జీఐబీ పునరుద్ధరణ సాధ్యం కాదు. కొన్నేళ్లుగా ఈ పక్షి ఆనవాళ్లు లేవు’ అని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) తన నివేదికలో ధ్రువీకరించింది. దేశంలోని జాతీయ పార్కులు, వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీల పనితీరుపై 2020-25 సంవత్సరాలకు సంబంధించి రూపొందించిన నిర్వహణ ప్రభావ అంచనా నివేదికలో ఈ విషయాన్ని డబ్ల్యూఐఐ ప్రస్తావించింది. అంటే... రోళ్లపాడులో బట్టమేక పక్షి లేనట్లే!

దోపిడీకి ‘రక్షణ’ ముసుగు

బట్టమేక పక్షులు ఎక్కువగా రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి ప్రాంతంలో, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ పక్షికి కళ్లు తలకు చెరోవైపు ఉంటాయి. అందువల్ల దగ్గరకు వచ్చే వరకు అది కరెంటు తీగలను గుర్తించ లేదు. చివరి నిమిషంలో గుర్తించినా శరీర బరువు కారణంగా దిశను మార్చుకోలేక తీగలను ఢీకొని చనిపోతుంటాయి. రాజస్థాన్‌, గుజరాత్‌లోని జీఐబీ ఆవాసాల వద్ద ఉన్న హైటెన్షన్‌ తీగల కారణంగా ఈ పక్షులు చనిపోతున్నాయని, వాటిని సంరక్షించాలంటూ 2019లో పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ... రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రభుత్వాలకు జీఐబీల సంరక్షణలకు చర్యలు తీసుకోవాలని కోరింది. జీఐబీలు నివసించే ప్రాంతంలో హైటెన్షన్‌ వైర్లను భూగర్భంలో వేయాలని, సంచరించే ప్రాంతంలో బర్డ్‌ డైవర్టర్లను పెట్టాలని ఆదేశించింది. రాష్ట్ర విద్యుత్తు అధికారులు ఈ ఆదేశాలనే అడ్డు పెట్టుకున్నారు.


అయినా రక్షిస్తారట...

కనిపించని బట్టమేక పక్షిని సంరక్షించేందుకు విద్యుత్తు శాఖ రూ.7.80 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. అప్పుడెప్పుడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడు అమలు చేసేందుకు ముందుకొచ్చింది. రోళ్లపాడు వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ మీదుగా వెళ్లే ఈహెచ్‌టీ లైన్లకు పక్షులు ఢీకొనకుండా 40,522 బర్డ్‌ ఫ్లైట్‌ డైవర్టర్లను (నాన్‌ ఎల్‌ఈడీ) ఏర్పాటు చేయాలంటూ టెండర్లు పిలిచింది. విద్యుత్తు శాఖ పేర్కొన్న స్టాండర్డ్‌ రేట్‌ టారిఫ్‌ ప్రకారం, డైవర్టర్లను కొనడం.. ఏర్పాటు చేయడం ఒక్కరే చేయాలి. దీనికిగాను యూనిట్‌కు రూ.1,470గా నిర్ణయించారు. కానీ విద్యుత్తు శాఖ పిలిచిన టెండర్‌లో డైవర్టర్ల కొనుగోలుకు.. ఏర్పాటు చేసేందుకు వేర్వేరుగా టెండర్లు పిలవడం గమనార్హం. ఈ ముసుగులో భారీగా జేబులు నింపుకొనేందుకు సిద్ధమయ్యారనేది సుస్పష్టం. 40,522 డైవర్టర్లకు ఒక్కో దానికి రూ.1091.80 చొప్పున రూ.4.42 కోట్లకు టెండరు పిలిచారు. ఈ మొత్తానికి జీఎస్టీ కలిపి రూ.5.22 కోట్లు అవుతుంది. వీటిని ఏర్పాటు చేసేందుకు లేబర్‌ రేటు ఒక్కో దానికి రూ.410 చొప్పున రూ.1.66 కోట్లకు టెండరు పిలిచారు. దీనికి జీఎస్టీ కలిపి రూ.1.96 కోట్లు అవుతుంది. అయినవారికి టెండర్లు కట్టబెట్టేందుకే ఇలా విడగొట్టి పిలిచారని స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో రోళ్లపాడు శాంక్చురీ విస్తీర్ణం సుమారు 6 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ, అధికారులు రోళ్లపాడుకు 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం వరకు డైవర్టర్లను ఏర్పాటు చేసేందుకు టెండరు పిలవడం గమనార్హం. అసలు రోళ్లపాడులోనే బట్టమేక పక్షులు లేవని డబ్ల్యూఐఐ స్పష్టం చేసినా... వాటి సంరక్షణకు శ్రీశైలం వరకు డైవర్టర్లను ఏర్పాటు చేయాలనుకోవడం విడ్డూరం!

బట్టమేక పక్షి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రోళ్లపాడులో 1984లో తొలిసారి కనిపించింది. అప్పటి వరకు రాజస్థాన్‌, గుజరాత్‌లోనే తక్కువ సంఖ్యలో ఉన్నాయని భావిస్తున్న ఈ పక్షులు 35 వరకు రోళ్లపాడులో కనిపించాయి. అంతరించిపోతున్న జాతి పక్షుల జాబితాలో ఉన్న బట్టమేకను సంరక్షించేందుకు 1998లో రోళ్లపాడు వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీని ఏర్పాటు చేశారు. ఇక్కడ చివరిసారిగా ఈ పక్షి 2022 మార్చిలో కనిపించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Updated Date - Oct 08 , 2025 | 05:37 AM