Clay Ganpati Idols: 2 గంటల్లో 7,730 మట్టి ప్రతిమలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:02 AM
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంతో పాటు నగరంలోని పలు విద్యాసంస్థల్లో మంగళవారం నిర్వహించిన గణపతి మట్టి ప్రతిమల తయారీ కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
విద్యార్థులు, 20 స్వచ్ఛంద సంస్థల ప్రపంచ రికార్డు
విజయవాడ సిటీ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంతో పాటు నగరంలోని పలు విద్యాసంస్థల్లో మంగళవారం నిర్వహించిన గణపతి మట్టి ప్రతిమల తయారీ కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పండుగలు పర్యావరణ హితం కావాలనే ఉద్దేశంతో విద్యా, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పిలుపు మేరకు 20 పాఠశాలల విద్యార్థులు, 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 2గంటల వ్యవధిలోనే మట్టితో 7,730 గణేశుడి విగ్రహాలను తయారు చేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)కు చెందిన పర్యవేక్షకులు తయారీ విధానం, ప్రతిమల సంఖ్యను వీడియో, ఫొటోలు తీసి లండన్‌కు పంపారు. గతంలో 4,464ప్రతిమలు తయారు చేసి మహారాష్ట్ర నెలకొల్పిన రికార్డును ఎన్టీఆర్ జిల్లా అధిగమించింది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమ వేదికపై మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), కలెక్టర్‌కు వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్ట్స్ పత్రాన్ని ఆ సంస్థ జాయింట్ సెక్రటరీ ఎలియాజర్ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా, పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.