Montha Cyclone Strikes: నాడు మసులీపట్నం.. నేడు మొంథా
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:59 AM
1949 అక్టోబరు 28... 2025 అక్టోబరు 28... సంవత్సరాలు వేరైనా ఈ తేదీలకు మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది..! సరిగ్గా 76 ఏళ్ల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..
76 ఏళ్ల తర్వాత అదే తేదీన పంజా విసిరిన తుఫాను
అప్పట్లో 3లక్షల ఇళ్లు ధ్వంసం.. 800 మంది మృతి
దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
1949 అక్టోబరు 28... 2025 అక్టోబరు 28... సంవత్సరాలు వేరైనా ఈ తేదీలకు మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది..! సరిగ్గా 76 ఏళ్ల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర తుఫానుగా మారి అక్టోబరు 28న మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. తాజాగా రాష్ట్రాన్ని వణికించిన మొంథా కూడా ఇదే తేదీన తీరం దాటింది. ఇది యాదృచ్చికమే అయినా.. అప్పుడు సంభవించిన నష్టానికి.. ఇప్పుడు జరిగిన నష్టానికీ భారీ తేడా ఉంది. అప్పట్లో సరైన సమాచార వ్యవస్థ లేదు. ప్రకృతి విపత్తుల సమయంలో సకాలంలో స్పందించే వ్యవస్థ లేదు. అప్పట్లో ఏ సమాచారమైనా రేడియోల ద్వారానే తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ల రూపంలో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుస్తు ప్రణాళికలు రూపొందించడంతో మొంథా ప్రభావంతో పెద్దగా నష్టం జరగలేదు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా పంట నష్టం సంభవిచింది తప్ప ప్రాణ, ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. అయితే.. 1949లో ఇలాంటివేమీ లేకపోవడంతో ఆస్తి, ప్రాణ, పంటనష్టం తీవ్రంగా కనిపించింది.
1949లో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అక్టోబరు 28న తెల్లవారుజామున మచిలీపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అప్పట్లో ఎక్కడ తీరం దాటితే అదే ఆ తుఫాను పేరుగా నిర్ణయించేవారు. ఆ రోజుల్లో మచిలీపట్నాన్ని ‘మసులీపట్నం’ అని పిలిచేవారు. దీంతో ఈ తుఫానుకి ‘మసులీపట్నం’ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. దీని ప్రభావంతో ఈదురు గాలులు భారీగా వీయడంతో 27వ తేదీ రాత్రి నుంచే ఈ నాలుగు జిల్లాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. మొత్తం 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గూడు చెదిరిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అండమాన్‌లో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ తీరంవైపు దూసుకొచ్చింది. దీంతో 1949 అక్టోబరు 26న వాతావరణ కేంద్రం తీవ్ర తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. ఇది 28వ తేదీ రాత్రి తీరాన్ని తాకింది. ఈ తీవ్ర తుఫాన్ వల్ల మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాల్లో గంటకు 136 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో అలలు 10 నుంచి 15 అడుగుల ఎత్తువరకు ఎగసిపడ్డాయి. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నదులు ఉప్పొంగాయి. సాగునీటి కాల్వలు అస్తవ్యస్థమయ్యాయి. 27వ తేదీ అర్ధరాత్రి నుంచి 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు సుమారు 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాడు ఈ తుఫాన్ హెచ్చరికలన్నీ చెన్నైలోని వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డాయి. విజయవాడ, చెన్నైలోని ఆలిండియా రేడియో కేంద్రాల నుంచి 25వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రత్యేక ప్రసార కార్యక్రమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తుఫాన్ తీవ్రతను తెలియజేస్తూ హెచ్చరించినందుకు అప్పట్లో అనేక మంది విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని అభినందిస్తూ లేఖలు పంపారు.