Share News

Neglect of North Andhra Irrigation Projects: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చిన్నచూపు!

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:25 AM

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. 70 నుంచి 93 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులిస్తే పూర్తవుతాయి. ఇది తెలిసినా ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చే స్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019- 24 కాలంలో జగన్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ప్రాజెక్టులను ధ్వంసం చేసింది.....

Neglect of North Andhra Irrigation Projects: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చిన్నచూపు!

  • 70-90% పూర్తయినా జగన్‌ హయాంలో ముందుకు సాగని నిర్మాణాలు

  • కూటమి పాలనలోనూ అదే తీరు

  • కొద్ది నిధులతోనే పూర్తవుతాయనితెలిసినా పైసా విదిల్చని ఆర్థిక శాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. 70 నుంచి 93 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులిస్తే పూర్తవుతాయి. ఇది తెలిసినా ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చే స్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019- 24 కాలంలో జగన్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ప్రాజెక్టులను ధ్వంసం చేసింది. కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిలో కదలిక వస్తుందని సాగునీటి రంగ నిపుణులు ఆశించారు. కానీ స్వల్ప ఖర్చుతోనే సాగు నీరందించే ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌ -2

ఉత్తరాంధ్రలో బీఆర్‌ అంబేడ్కర్‌ వంశధార ప్రాజె క్టు అత్యంత ముఖ్యమైనది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో కాట్రగడ సమీపంలో వంశధార నదిపై హిరమండల రిజర్వాయరులో 19.05 టీఎంసీలను నింపి.. వరద కాలువ ద్వారా సింగిడి, పారాపురం వరకూ వంశధార జలాలను తరలించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,624.50 కోట్లు కాగా.. ఇప్పటికే 93.5 శాతం పనులు పూర్తి చేశారు. మరో రూ.171.91 కోట్లు వ్యయం చేస్తే వంశధార ప్రాజెక్టు భూసేకరణ సహా పూర్తవుతుంది. 20 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. నాలుగున్నర లక్షల మందికి తాగునీరందుతుంది.


తోటపల్లి బ్యారేజీ..

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తోటపల్లి బ్యారేజీ నిర్మాణాన్ని నాగావళి నదిపై రూ.1,250.79 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019 నాటికే పనులు 84.77 శాతం పూర్తయ్యాయి. రూ.263.36 కోట్లను వ్యయం చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 84,033 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. మరో 84 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 4.69 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

తారకరామ తీర్థసాగర్‌..

విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రే డు వద్ద చంపావతి నదిపై దీనిని రూ.739.90 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రూ.337.67 కోట్లతో 45 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.808.36 కోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 16,538 ఎకరాల కొత్త ఆయకట్టు, డెంకాడ ఆనకట్ట పరిధిలోని 8,172 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. విజయనగరం ము న్సిపాలిటీతోపాటు భోగాపురం విమానాశ్రయానికి తాగునీటిని అందించే వీలుంది. ఉత్తరాంధ్రలో మ హేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు ని ర్మాణం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. 48 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 506.68 కోట్లిస్తే భూసేకరణ, ప్రాజెక్టు పూర్తవుతుంది.

హిరమండలం ఎత్తిపోతల..

గొట్టా బ్యారేజీ ద్వారా హిరమండలం రిజర్వాయరులో 10 నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.176.35 కోట్లు మాత్రమే. ఇప్పటికే 45 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం వల్ల అంచనా వ్యయం రెట్టింపైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం హైలెవల్‌ కెనాల్‌ ద్వారా వంశధార-నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టును రూ.145.34 అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019 నాటికే 73 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రూ.108.17 కోట్లు వ్యయం చేస్తే చాలు. శ్రీకాకుళం జిల్లాలో మడ్డువలస స్టేజ్‌-2 ప్రాజెక్టును రూ.99.77 కోట్లతో చేపట్టారు. ఇప్పటికే 79.97 శాతం పూర్తయింది. అంచనా వ్యయం పెరగడంతో మరో రూ.79.77 కోట్ల వ్యయం చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని కూటమి సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Updated Date - Nov 19 , 2025 | 05:25 AM