Senior AVOB Leader Tech Shankar: మరో ఏడుగురు నక్సల్స్ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:19 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ ఏవోబీ కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతోపాటు.....
హిడ్మాను నేలకూల్చిన మారేడుమిల్లిలోనే మళ్లీ ఎదురుకాల్పులు
అంతా హిడ్మా దళ సభ్యులే.. మృతుల్లో ఏవోబీ నేత టెక్ శంకర్
37 ఏళ్ల క్రితం సిక్కోలు నుంచి జోగారావు ఉద్యమబాట
మిలిటరీ, టెక్నికల్ రంగాలపై గట్టిపట్టు.. హిడ్మా దళంలో అత్యంత సీనియర్.. 2 రోజుల్లో 13 మంది ఎన్‌కౌంటర్
రాజమహేంద్రవరం/మారేడుమిల్లి/రంపచోడవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతోపాటు మరో ఆరుగురు ఉన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మా దళ సభ్యులు. టెక్ శంకర్ ఈ దళంలో అత్యంత సీనియర్ నేత అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం ఆరుగురు ఇదే ప్రాంతంలో మంగళవారం ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే. హిడ్మా దళం కోసం ‘ఆపరేషన్ సంభవ్’ పేరుతో గాలిస్తున్న కేంద్ర, ఆంధ్ర పోలీసు బృందాలు గత రెండు రోజుల్లో 13 మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశాయి. పోలీసు వర్గాల కథనం ప్రకారం, మారేడుమిల్లి మండలం జీఎం వలస గ్రామ పరిధిలోని నల్లకొండ సమీపంలోని పెదనేరేడు చెట్టు ప్రాంతంలో బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి.
అవి బూటకపు ఎన్‌కౌంటర్లు కావు: బర్దర్
ఏవోబీలో మావోయిస్టులు మళ్లీ రిక్రూట్‌మెంట్ మొదలెట్టారని, ఇది తెలిసి కూంబింగ్ నిర్వహించినట్టు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లు చేయాల్సిన అవసరం లేదని, లొంగిపోతామంటే, దానికిఅవకాశం ఇవ్వడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వివరించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న విస్తృత కూంబింగ్‌లో మావోయిస్టులపై పైచేయి సాధించగలిగామన్నారు. రంపచోడవరంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మరణించారు. ఆ ఘటనలో తప్పించుకున్నవారికోసం కోసం మా బలగాలు గాలింపు సాగిస్తుండగా, బుధవారం మరోసారి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు జరపగా, ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి రెండు ఏకే 47లు, ఐదు ఏకే 47 తూటాల మాలలు, ఐదు ఎస్‌బీబీఎల్ తుపాకులు, 34 రౌండ్ల ఎస్‌బీబీఎల్ తూటాలు, 303 రైఫిల్, 24 రౌండ్ల 303 తూటాలు, మూడు కిలోల వైర్, 18 డిటోనేటర్లు, కిట్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు. మావోయిస్టులు ఏవోబీని షెల్టర్‌జోన్‌గా చేసుకోవాలని చూస్తున్నారని, ఏవోబీ, ఛత్తీ్‌సగఢ్‌లకు చెందిన మావోయిస్టులు ఏపీ, ఒడిశా వైపు చూస్తున్నారన్నారు. ఇంకా ఎంతమందిని లక్ష్యంగా చేసుకున్నారన్న ప్రశ్నకు ఎస్పీ స్పందిస్తూ.. తమ బలగాలు సాగించే కూంబింగ్‌లో ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాలన్నారు.
కాల్పుల చప్పుళ్లకు భయపడ్డాం : గ్రామస్థులు
బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఆకస్మికంగా కాల్పుల చప్పుళ్లు వినిపించాయని జీఎం వలస గ్రామ ప్రజలు తెలిపారు. ఈ గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. కొండరెడ్లు, కోయ, వాల్మీకీ కులాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. ‘‘మేమంతా రోజూ ఉదయమే లేచి, రబ్బర్ చెట్లపాలు తీయడం, జీలుగుకల్లు తీయడం, చెట్లు కొట్టడం వంటి పనులకు వెళుతుంటాం. కానీ, బుధవారం ఉదయం కాల్పుల శబ్దాలు విన్నాం. ఒకవేళ ప్రధాన రహదారిలో ఉండే జలతరంగిణి వద్ద పర్యాటకులు బాణసంచా కాల్చారేమోనని మొదట అనుకున్నాం. ఆ తర్వాత విషయం తెలిసి భయపడ్డాం. మా ప్రాంతంలో ఎప్పుడూ ఎన్‌కౌంటర్లు జరగలేదు. మావోయి్‌స్టలు ఏనాడూ ఇటు రాలేదు. న్యూడెమోక్రసీ మాత్రం ఉండేది. దానిని మేం నిక్కర్ పార్టీ అనేవారం. కాల్పుల శబ్దాలు వినిపించిన కొద్దిసేపటికి పోలీసులు రోడ్డు మీద కనిపించారు. మధ్యాహ్నం వేళ లోపల నుంచి మృతదేహాలను తీసుకుని వచ్చి వ్యాన్‌లో ఎక్కించడం చూశాం. మమ్మల్ని దగ్గరకు పోనీయలేదు.’’ అని గ్రామస్థులు పల్లాల నారాయణరెడ్డి. జగన్నాఽథరెడ్డి, పరిమిరెడ్డి, నగ్నా, రామలక్ష్మి, సునీత తెలిపారు. కాగా, గత రెండు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు రాజమహేంద్రవరం- భద్రాచలం రోడ్డుకు అటూ ఇటూ జరిగాయి. ఈ రోడ్డుకు 4 కిలోమీటర్ల దూరంలోని నెల్లూర్ గ్రామ సమీపంలో మంగళ వారం ఎన్‌కౌంటర్ జరగగా, ఈ రోడ్డుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీఎం వలస అడవి లోపల బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి.
మిలిటరీ దాడుల్లో దిట్ట..
మెట్టూరి జోగారావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం. జోగారావు పదోతరగతి వరకు వజ్రపుకొత్తూరు మండలంలో చదువుకున్నాడు. క్రమంగా నక్సల్ ఉద్యమాల పట్ల ఆకర్షితుడై.. 1988లో పీపుల్స్‌వార్‌లో చేరాడు. మిలిటరీ, టెక్నాలజీలో మంచి పట్టు సాధించి ఆంధ్ర-ఒడిశాలో టెక్ శంకర్‌గా ఎదిగాడు. ఐదేళ్ల క్రితం శ్రీకాకుళం అప్పటి ఎస్పీ... జోగారావు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఆయనను లొంగిపోవాలని కోరాలని సూచించారు. ఆయన తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఇదే ప్రాంతం నుంచి చెల్లూరి నారాయణరావు కూడా మావోయిస్టుల్లో కలిశారు. జోగారావు ఎన్‌కౌంటర్ నేపథ్యంలో చెల్లూరిని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు మాజీ చీఫ్ నంబాల కేశవరావు వద్ద గార్డ్ కమాండర్‌గా పనిచేసిన జ్యోతి అలియాస్ సరిత; సురేశ్ అలియాస్ రమేశ్; కేంద్రకమిటీ మాజీ సభ్యుడు కటకం సుదర్శన్ బాడీగారు లోకేశ్ అలియాస్ గణేశ్; సైను అలియాస్ వాసు, అనిత, సామినీ ఉన్నారు.