Share News

Minister Tummala Nageswara Rao: 65 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు!

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:45 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వచ్చే నెలలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ...

Minister Tummala Nageswara Rao: 65 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు!

  • నవంబరు 19 న పంపిణీ: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వచ్చే నెలలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ, చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నవంబరు 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ చీరల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల, జౌళీ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో నాణ్యతపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను ఉత్పత్తి చేయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మహిళల కోసం 6.5 మీటర్ల చీరలు, వృద్ధుల కోసం తొమ్మిది మీటర్ల చీరలు రూపొందించామన్నారు. ఇందిరమ్మ చీరెల తయారీతో దాదాపు 6,500 నేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు చేనేత రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 33.50 లక్షల చీరలు జిల్లా స్థాయిలో గోదాములకు చేరాయని, మిగిలిన చీరెలను నవంబరు 15లోపు క్షేత్రస్థాయికి చేర్చాలని టెస్కో మంత్రి అధికారులకు సూచించారు.


నేతన్నకు భరోసా..

చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పథకంతో 6,780 మంది చేనేత కార్మికులు లక్ష రూపాయల వరకు రుణ విముక్తులవుతారని తుమ్మల వెల్లడించారు. నేతన్న భరోసా పథకంలో చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వటానికి ఈ ఏడాది రూ. 48.80 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకంలో నేతన్నలకు రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో ప్రోత్సాహకం అందిస్తామని తుమ్మల వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు.. వస్త్రాలు కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్లు టెస్కో నుంచే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని యాదాద్రి భువనగిరిలోని పోచంపల్లికి మార్చాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు.

Updated Date - Oct 11 , 2025 | 02:45 AM