Share News

Visakhapatnam: 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజీ

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:37 AM

జీవీఎంసీ జోన్‌-2 (మధురవాడ) పరిధిలో రూ.553 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను (యూజీడీ) అందుబాటులోకి తీసుకురానున్నారు.

Visakhapatnam: 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజీ

  • జీవీఎంసీకి 498 కోట్ల ఐఎఫ్‌సీ రుణం

  • భారీ రుణం నేరుగా పొందిన తొలి సంస్థగా ఘనత

  • తక్కింది సర్దుబాటు చేయనున్న కేంద్రం

  • సీఎం సమక్షంలో ఒప్పందం ఖరారు

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ జోన్‌-2 (మధురవాడ) పరిధిలో రూ.553 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను (యూజీడీ) అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకుకు అనుబంధంగా పనిచేసే అంతర్జాతీయ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) రుణంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు విజయవాడలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ఐఎఫ్‌సీ ఆసియా హెడ్‌ విక్టోరియాడెల్మాన్‌ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఐఎఫ్‌సీ నుంచి అంతభారీ రుణాన్ని నేరుగా పొందిన తొలి స్థానిక సంస్థగా జీవీఎంసీ గుర్తింపు పొందింది.


రుణం, వడ్డీ చెల్లింపునకు 15 ఏళ్లు గడువు

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మధురవాడ, కొమ్మాది, రుషికొండ, ఎండాడ వంటి ప్రాంతాల్లో నివాసాలు, ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతాలు మరింతగా విస్తరిస్తాయి. అయితే జోన్‌-2 పరిఽధిలో సాగర్‌నగర్‌, విశాలాక్షినగర్‌, ఆరిలోవ వంటి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో యూజీడీ సదుపాయం లేదు. జోన్‌ పరిధిలో యూజీడీ సదుపాయం ఉన్న ప్రాంతం కేవలం 20 శాతానికి మించదు. ఈ నేపథ్యంలో జోన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ ఎప్పటినుంచో ప్రణాళికలు తయారుచేస్తోంది. యూజీడీ పైప్‌లైన్‌తోపాటు పంప్‌హౌస్‌లు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం సుమారు రూ.498 కోట్లు అవసరమని అంచనా వేసింది. దీంతోపాటు నగరంలో యూజీడీ నెట్‌వర్క్‌ సదుపాయం లేని ప్రాంతాల కోసం అదనంగా మరో రూ.55 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. అంతమొత్తాన్ని ఒకేసారి జీవీఎంసీ భరించే పరిస్థితి లేకపోవడంతో రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా ఐఎఫ్‌సీతో సంప్రదింపులు గతకొంతకాలంగా జరుగుతున్నాయి. జీవీఎంసీకి ఏటా పన్నుల రూపంలో రూ.400 కోట్లు వరకు ఆదాయం వస్తుందని, ఆ మొత్తంలో కొంత రుణ వాయిదాలుగా చెల్లిస్తామని అధికారులు ఐఎఫ్‌సీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివరించారు. దీనికి ఐఎఫ్‌సీ అధికారులు సానుకూలంగా స్పందించారు. రూ.498 కోట్ల రుణం కేటాయించాలని నిర్ణయించారు. రుణం, వడ్డీ (8.15 శాతం) కలిపి 15 ఏళ్లలో తీర్చేలా జీవీఎంసీ, ఐఎఫ్‌సీ అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. అమృత్‌-2.0లో భాగంగా 45.64 కోట్లు కేంద్రం సర్దుబాటు చేస్తుంది. జీవీఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వెచ్చిస్తుంది.

Updated Date - Sep 09 , 2025 | 04:38 AM