Pedanandipadu: కలుషిత ఆహారం తిని 54 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:42 AM
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలోని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స
పరామర్శించిన మంత్రి సవిత
పెదనందిపాడు/గుంటూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలోని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 16 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. వెంటనే వారిని పెదనందిపాడులోని పీహెచ్‌సీకి తరలించారు. మిగిలిన 38 మంది కూడా అనారోగ్యానికి గురవడంతో పెదనందిపాడులోని ఆర్యవైశ్య కల్యాణ మండపానికి తరలించి అక్కడ ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయా పెదనందిపాడు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. 16 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కాగా.. అస్వస్థతకు గురైన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పరామర్శించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వారికి ధైర్యం చెప్పారు.