Share News

CM Chandrababu Naidu: 51శాతం కూటమి పాలనపై మంది సంతృప్తి

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:15 AM

కూటమి ప్రభుత్వ పాలనపై 51 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, తమకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu Naidu: 51శాతం కూటమి పాలనపై మంది సంతృప్తి

  • వారికి ఏ సమస్యా లేదు.. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం

  • 49 శాతం ప్రజలకు పలు సమస్యలు

  • గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైనే అసంతృప్తి

  • అసంతృప్తిలో రెవెన్యూదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనపై 51 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, తమకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు. వివిధ మార్గాల్లో సేకరించిన సర్వేల ఆధారంగా ప్రజల సంతృప్తిని అంచనా వేసినట్టు వెల్లడించారు. 51 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సీఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సేవలతో సంతృప్తిగా ఉన్నామని 51 శాతం మంది చెప్పడం సర్కారు సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు. అయితే, రెవెన్యూ శాఖపై ప్రజలు అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉందన్నారు. ప్రజల సంతృప్త స్థాయిని మరింత పెంచేందుకు మంత్రులు, శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు, అధికారులకు కలిసి పనిచేయాలని సూచించారు. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం పలు అంశాల్లో ప్రజల సంతృప్త స్థాయి ఇదీ..

  • రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని 17 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఏజెన్సీ ప్రాంతాల్లోని రోడ్లు ఉన్నాయు. కాగా, ఇది వారసత్వంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్య అని సీఎం చంద్రబాబు తెలిపారు.

  • పట్టణాలు, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ సరిగాలేదని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5.3 శాతం మంది ఈ సమస్యను ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి చెప్పారు.

  • గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని 4.3 శాతం మంది తెలిపారు.

  • ఇంటి నిర్మాణం సహా స్థలం కావాలని కోరినా తమ విన్నపాలు పట్టించుకోవడం లేదని 3.8 శాతం మంది పేర్కొన్నారు.


  • రాష్ట్రంలో నిరుద్యోగంపై 3.3 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారు. తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

  • వ్యవసాయ రంగంలో ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు, స్పందన లేదని 2.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • కొత్తగా పింఛన్లు కోరుకుంటున్నవారి సంఖ్య 2 శాతంగా ఉంది.

  • రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేని 1.1శాతం మంది చెప్పారు.

  • భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఇది 1.3 శాతంగా ఉంది.

  • విద్యుత్‌ చార్జీల భారం, కోతలు ఉన్నాయని 0.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంలో ఆశించిన విధంగా పనులు జరగడం లేదని 0.4 శాతం మంది, ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందడం లేదని 0.3 శాతం మంది చెప్పారు.

Updated Date - Dec 18 , 2025 | 05:15 AM