TTD EO Anil Kumar Singhal: తిరుమల తరహాలో 5 వేల ఆలయాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:11 AM
రాష్ట్రంలో టీటీడీ నిర్మించ తలపెట్టి 5 వేల ఆలయాల బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ ఆలయాల నిర్మాణానికి రూ.750 కోట్లు ఖర్చు అవుతుందని ముందుగా అంచనా వేశారు.
సీఎం సూచనలతో నమూనాల్లో మార్పులు
700 ఆలయాలకు దరఖాస్తులు, 206కు ఓకే
ధ్వజస్తంభాల కోసం సొంతంగా చెట్ల పెంపకం
అన్ని శ్రీవారి ఆలయాల్లోనూ అన్న ప్రసాదం
‘ఆంధ్రజ్యోతి’తో టీటీడీ ఈవో సింఘాల్
తిరుపతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీటీడీ నిర్మించ తలపెట్టి 5 వేల ఆలయాల బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ ఆలయాల నిర్మాణానికి రూ.750 కోట్లు ఖర్చు అవుతుందని ముందుగా అంచనా వేశారు. అయితే ఈ ఆలయాల నిర్మాణంపై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఆలయానికీ సంప్రదాయ పద్ధతిలో మండపం, గర్భగుడి, గోపురం, ప్రాకారం ఉండేలా నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్, దేవదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల నిర్మాణ వ్యయం రూ.750 కోట్ల నుంచి రూ.1250 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత నిర్ణయించిన మేరకు రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల చొప్పున మూడు కేటగిరీలలో ఆలయాలను నిర్మించాలనుకున్నారు. నమూనాల మార్పుతో ఒక్కో ఆలయం నిర్మాణ వ్యయం అదనంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. టీటీడీలో జరుగుతున్న అనేక మార్పుల గురించి వివరించారు.
మార్చినాటికి అనుమతులు
వచ్చే మార్చి నెలాఖరులోగా 5 వేల ఆలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంగా ఉన్నామని ఈవో సింఘాల్ చెప్పారు. ఈ ఆలయాల నిర్మాణాల కోసం దేవదాయ శాఖకు టీటీడీ రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు. తమ ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలంటూ ఇప్పటిదాకా 700 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి సోమవారం నాటికి 206 దరఖాస్తులను ఆమోదించినట్టు తెలిపారు. వీటిపై ప్రతి సోమవారం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ల స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆయాచోట్ల లభ్యమయ్యే స్థలాన్ని బట్టి నమూనాలను నిర్ణయిస్తామని ఈవో చెప్పారు. నిధుల విషయంలో దాతలు, ప్రజల భాగస్వామ్యాన్ని బట్టి మిగిలిన మొత్తాన్ని టీటీడీ వెచ్చిస్తుందని తెలిపారు.
రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కూడా చర్యలు మొదలయ్యాయని ఈవో సింఘాల్ తెలిపా రు. అసోం రాజధాని దిస్‌పూర్‌లో ఆలయ నిర్మాణాని కి అవసరమైన స్థలాన్ని అక్కడి ప్రభుత్వం ఈ నెల లో కేటాయించనుందన్నారు. బిహార్ రాజధాని పట్నాలో 10 ఎకరాల భూమిని గుర్తించినట్టు అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో 19.50 ఎకరాల భూమిని గుర్తించారని, చెన్నై, ముంబైలలో ఇప్పటికే స్థలాలను టీటీడీ తీసుకుందన్నారు. తిరుమలపై ఒత్తిడి తగ్గించేందుకు తిరుపతిలోని అలిపిరిలో భక్తు ల కోసం బేస్‌క్యాంప్ నిర్మించనున్నట్టు ఈవో తెలిపారు. సీఎం ఆదేశాలతో పర్యాట ప్రాజెక్టుల నుంచి టీటీడీ ఆధీనంలోకి వచ్చిన 25 ఎకరాల స్థలంలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు.
100 ఎకరాల్లో చెట్ల పెంపకం
టీటీడీ నిర్మించనున్న ఆలయాల్లో ధ్వజస్తంభాల ఏర్పాటుకు అవసరమైన చెట్లను పెంచాలని ఆలోచిస్తున్నట్టు ఈవో చెప్పా రు. దీనికిగాను తిరుపతిలో 100 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. ధ్వజస్తంభాలకు అవసరమైన పరిమాణంలోని పెద్ద వృక్షా లు దేశంలోని అడవుల్లో లభ్యం కావడంలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
అమరావతిలో రోజూ పవిత్ర హారతి
రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో ఇకపై ప్రతి రోజూ పవిత్ర హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. వారాణసిలో గంగా హారతి తరహాలో ఇక్కడ కూడా హారతి ఇచ్చే లా చూడాలని సీఎం సూచించారని చెప్పారు. అమరావతిలో శ్రీవారి ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మితమైందని, మిగిలిన 20 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు.
టీటీడీ ఆలయాల్లో అన్న ప్రసాదం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 60 టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరులోపు భక్తులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని ఈవో సింఘాల్ చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల అన్న ప్రసాద వితరణ జరుగుతోందన్నారు. అన్న ప్రసాదాల తయారీ, పంపిణీకి ధార్మిక సంస్థలు, మఠాలు వంటివి ముందుకు వస్తే వారితో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడానికి టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. టీటీడీ ఆలయాలన్నింటిలోనూ తిరుమల తరహాలోనే కైంకర్యాలను నిర్వహిస్తామన్నారు. అవసరమైన అర్చకులు, పోటు కార్మికులు, వేద పారాయణ చేసేవారిని నియమించనున్నట్టు తెలిపారు.